స్టాల్‌ పెట్టు.. ప్రచారం కొట్టు

22 Jan, 2017 02:35 IST|Sakshi
స్టాల్‌ పెట్టు.. ప్రచారం కొట్టు

చంద్రబాబు దావోస్‌ పర్యటనల ఆంతర్యమిదే
కీలక ఉపన్యాసకుల్లో సీఏం పేరే లేదు
టికెట్‌ కొనుక్కొని హాజరై,ప్రత్యేక ఆహ్వానమంటూ అబద్ధాలు
ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు రూ.7.52 కోట్లు చెల్లింపు
సదస్సులో లాంజ్‌ ఏర్పాటుకు మరికొంత ఖర్చు
ప్రత్యేక విమానం, తదితర ఖర్చులు అదనం
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ ఇదే తంతు
సర్కారు సొమ్ముతో తననో ఆర్థిక మేధావిగా చూపించుకునే యత్నం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ యాత్రల లోగుట్టు బట్టబయలైంది. ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో పాల్గొనేందుకు తనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చిందంటూ ఆయన ఘనంగా చెప్పుకోగా... అలాంటి ఆహ్వానం లేనేలేదని, రూ.కోట్ల ఫీజు చెల్లించి వెళ్లారని వెల్లడైంది. ముఖ్యమంత్రి పలు అంశాలపై ఉపన్యసించారని సీఎం కార్యాలయం రోజుకో పత్రికా ప్రకటన విడుదల చేయగా... కీలక ఉపన్యాసకుల జాబితాలో చంద్రబాబు పేరెక్కడా కానరాలేదు. పలు సంస్థల అధిపతులతో  చర్చలు జరిపినట్లు రోజూ పత్రికల్లో ప్రముఖంగా ఫొటోలు కనిపించగా... ఒక్క ఒప్పందమూ కుదిరిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చంద్రబాబు దావోస్‌ పర్యటనలన్నీ తననో ఆర్థిక మేధావిగా చూపించుకునేందుకు అబద్ధాలు, అభూత కల్పనలతో సాగిన కట్టుకథలేనని స్పష్టమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ క్రమం తప్పకుండా చేస్తున్న ఈ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ లేకపోగా ఖజానాపై మాత్రం రూ.కోట్ల భారం తప్పడంలేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

ప్రత్యేక ఆహ్వానం పెద్ద అబద్ధం
స్విట్జర్లాండ్‌లోని పర్యాటక కేంద్రమైన దావోస్‌లో ప్రతీ ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో పలు అంశాలపై చర్చలు, ఉపన్యాసాలు సాగుతాయి. ఇందులో ప్రపంచంలోని 100కు పైగా దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారు. బడా బడా కార్పొరేట్‌ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు, జీ20 తదితర కీలక దేశాల ప్రభుత్వాధినేతలు, ముఖ్యమైన రాజకీయ నాయకులు, సాంకేతిక రంగ ప్రముఖులు, సామాజిక వేత్తలు, సామాజిక సంస్థలు, మీడియా సంస్థల ప్రతినిధులు వీరిలో ఉంటారు. ప్రభుత్వాధినేతలు, మత పెద్దలు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సభ్యులు, వార్తా చానళ్ల ప్రతినిధులు వంటి కొందరు ఆహ్వానితులకు తెల్ల బ్యాడ్జీలు ఇస్తారు. వారికి ప్రవేశం ఉచితం. వాణిజ్యపరంగా హాజరయ్యేవారు మాత్రం రూ.14 లక్షలు పెట్టి ప్రవేశ టికెట్‌ ‘కొనుగోలు’ చేయాల్సిందే.

ఇప్పుడు దావోస్‌లో జరుగుతున్న 47వ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రత్యేకంగా తనకు ఆహ్వానం వచ్చిందని చంద్రబాబు చెప్పగా... ఆర్థిక సదస్సు కీలక ఉపన్యాసకుల్లో ఆయన పేరే లేదు. దీంతో ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనని, ఆయన టికెట్‌ కొనుక్కునే వెళ్లారని స్పష్టమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1995లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం నుంచి ప్రతీ ఏడాది ఇలా టికెట్‌ కొనుక్కునే వెళ్లారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం 2015, 2016 జనవరిలోనూ చంద్రబాబు దావోస్‌ పర్యటనకు వెళ్లారు. 2015 సదస్సులో చంద్రబాబును చూసి మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భావోద్వేగానికి గురయ్యారని పచ్చ పత్రికలు వార్తలు ప్రచురించాయి. కానీ ఆ ఏడాది ఉపన్యాసకుల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేరే తప్ప చంద్రబాబు పేరు కానరాలేదు.

చంద్రబాబు ఎప్పుడు దావోస్‌ వెళ్లినా యూరోపియన్‌ దేశాలనుంచి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నారని ఊదరగొట్టడమే తప్ప వాస్తవరూపం దాల్చలేదు. 2015, 2016 పర్యటనల్లోనూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు కొత్తగా విశాఖపట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తాయని చెప్పారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమ య్యాయి. తాజాగా ఈ ఏడాది దావోస్‌ పర్యటనకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఏకంగా రూ.7.52 కోట్లు వ్యయం చేశారు. అంతేకాకుండా ఈ సదస్సులో ఏపీ లాంజ్‌ ఏర్పాటునకు స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసుకుంది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేవలం ఒక సదస్సులో పాల్గొన్నామని ప్రచారం చేసుకునేందుకు ఇన్ని రూ.కోట్ల వ్యయం చేయడంపై అధికారులే విస్తుపోతున్నారు.

రూ.కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం
దావోస్‌ సదస్సులోఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ)కు అప్పగించింది. దావోస్‌ సదస్సు జరిగే ప్రాంతంలో ఇండియా లాంజ్‌కు సమీపంలో ఏపీ లాంజ్‌ను రిజర్వ్‌ చేయడానికి 6.39 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సీఐఐ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా సీఐఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది మార్చి 31వ తేదీనే కోరింది. సీఐఐ అంచనా నివేదికను పరిశీలించిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో అడ్వాన్స్‌గా 50 శాతం అంటే 3.20 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా పరిశ్రమల శాఖకు సూచించారు. దీంతో పరిశ్రమల ప్రోత్సాహకం (ప్రకటనలు, సేల్స్, ప్రచారం) కింద 3.20 కోట్ల రూపాయలను సీఐఐకి చెల్లిస్తూ గత ఏడాది మే 25వ తేదీన జీవో–160ను పరిశ్రమల శాఖ కార్యదర్శి అరోఖ్యరాజ్‌ జారీ చేశారు.

ఆర్థిక సదస్సులో వక్తగా పాల్గొనాలంటే ముందరే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి కాబట్టే అంత ముందుగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. తొలుత అంచనా వేసిన మేరకు మరో 3.19 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉంది. అయితే దావోస్‌లో వాచ్‌హస్‌ హోటల్‌లో బస చేసినందుకు అదనంగా రూ.1,13,57,500 వ్యయం అయినట్లు సీఐఐ పేర్కొంది. ఈ మొత్తాన్ని కూడా కలిపి చెల్లించాల్సిందిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో పరిశ్రమల శాఖకు సూచించారు. దీంతో మిగతా రూ.4,32,57,500 సీఐఐకి విడుదల చేస్తూ పరిశ్రమల శాఖ అక్టోబర్‌ 29వ తేదీన మరో జీవోను జారీ చేసింది. దీంతోపాటు ముఖ్యమంత్రి నేతృత్వంలో వెళ్లిన బృందానికి మరో కోటి రూపాయలు ఖర్చయింది.

ఆర్థిక సదస్సునుంచి ప్రత్యేక ఆహ్వానం రాకపోయినా వచ్చిందంటూ అబద్ధాలు చెప్పి నాలుగు రోజుల పాటు సదస్సు బయట ఒక హోటల్లో ఉపన్యాసాలు ఇచ్చేందుకు రూ. 7.52 కోట్ల వ్యయం చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. దావోస్‌ సదస్సులో పాల్గొనడమే అంతర్జాతీయ కీర్తిలా చెబుతున్న ముఖ్యమంత్రి మాటలకు ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్లు, గత రెండేళ్లుగా వెళ్లుతున్నా ఏదైనా ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా కోట్ల రూపాయలు వ్యయం చేశారని, తీరా ఆ సదస్సుల వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం కనిపించకపోయినప్పటికీ ప్రభుత్వ పెద్దలకు ప్రచారం మాత్రం వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీ పర్యటనల పేరుతో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటనలు జారీ చేసిన ప్రభుత్వం ఆ ఒప్పందాల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో కూడా ప్రకటిస్తే మంచిదని అధికార వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం.

ఒక ప్రవేశ టికెట్‌ ఖర్చు రూ.50 లక్షలు!
దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వాణిజ్యపరంగా హాజరయ్యేవారు రూ.14 లక్షలు పెట్టి ప్రవేశ టికెట్‌ ‘కొనుగోలు’ చేయాల్సిందే. కానీ ఆ టికెట్‌ కొనాలంటే ముందుగా ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సభ్యత్వం ఉండాలి. ఆ సభ్యత్వం కోసం సుమారు రూ. 36 లక్షలు కట్టాలి. అంటే.. మొత్తం రూ. 50 లక్షలు ఖర్చు పెడితే ఒక వ్యక్తి దావోస్‌ సదస్సుకు హాజరయ్యే అర్హత సాధిస్తారు.
► సదస్సులో కీలకమైన ప్రయివేటు పారిశ్రామిక సమావేశాలకు హాజరవ్వా లంటే.. ‘ఇండస్ట్రీ అసోసియేట్‌’ హోదా పొందాలి. అందుకోసం ఏడాదికి రూ.కోటి ఫీజు కట్టాలి.
► సదస్సుకు ఒక వ్యక్తి కాకుండా అదనంగా మరో వ్యక్తి హాజరవ్వాలంటే.. ‘ఇండస్ట్రీ పార్టనర్‌’ సభ్యత్వం ఉండాలి. అందుకోసం దాదాపు రూ.రెండు కోట్ల వార్షిక ఫీజు చెల్లించాలి.
► ఇద్దరికన్నా ఎక్కువ.. గరిష్టంగా ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరవ్వాలంటే.. ‘వ్యూహాత్మక భాగస్వామి’ సభ్యత్వం పొందాలి. అందుకు దాదాపు రూ. 4 కోట్లు వార్షిక ఫీజు చెల్లించాలి. ఐదుగురు సభ్యుల బృందంలో కనీసం ఒక మహిళా ప్రతినిధి అయినా ఉండాలి. అంటే.. ఐదుగురు సభ్యుల బృందం ఈ సదస్సుకు హాజరవ్వా లంటే దాదాపు రూ.4.50 కోట్లు వ్యయం అవుతుంది.
► ఇక ‘వ్యూహాత్మక భాగస్వామి’ సభ్యత్వం కావాలంటే.. ప్రపంచంలోని 250 అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉండటంతో పాటు.. ఆ కంపెనీ చైనా లేదా ఇండియాలో ఉండాలి. ఈ సదస్సులో ఒక పార్టీ ఇవ్వాలంటే ఒక్కో అతిథి కోసం కనీసం రూ. 15,000 చొప్పున ఖర్చు చేయాలి. ఇక సదస్సుకు హాజరవ్వాలంటే.. దావోస్‌ ప్రయాణానికి, అక్కడ బస చేయడానికి ఒక్కో ప్రతినిధికి కనీసం రూ. 30 లక్షలు ఖర్చవుతుంది. ఇక చంద్రబాబు బృందం ప్రత్యేక విమానం, తదితర ఖర్చులు మరింత అదనమే.

మరిన్ని వార్తలు