రూ. 80 కోట్ల విలువైన భూమి కబ్జా

16 Oct, 2013 03:05 IST|Sakshi
సాక్షి, బెంగళూరు : హుబ్లీలో రూ. 80 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రముఖ రాజకీయ నేతల బంధువులు ఆక్రమించుకున్నారని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్(ఎన్‌సీపీఎన్‌ఆర్) అధ్యక్షుడు హీరేమఠ్ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 1915లో ప్రజావసరాల కోసం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం హుబ్లీలో దాదాపు 8ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. హుబ్లీ స్పోర్ట్స్ గ్రౌండ్‌గా పిలవబడే ఈ మైదానం అప్పటి నుంచి 2008 వరకు ఆటమైదానంగానే కొనసాగిందని పేర్కొన్నారు. అయితే 2008-2009 మధ్య కాలంలో ఆటమైదానం బాధ్యతలను నిర్వర్తించిన  కర్ణాటక జిమ్‌ఖానా అసోషియేషన్ సంస్థ కొంత మంది రాజకీయ నాయకులను, వారి బంధువులను సభ్యులుగా చేర్చుకుందని వివరించారు. అనంతరం వీరంతా కలిసి ఆటమైదానం రూపు రేఖలను మార్చడం మొదలుపెడుతూ రిక్రియేషన్ క్లబ్ పేరిట నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. 
 
క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ కోసం మాత్రమే కేటాయించిన ఈ స్థలంలో బిలియర్డ్స్, స్పా, బార్ తదితరాలను నిర్మించి వాటి ద్వారా రాజకీయ నేతల బంధువులు డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ తమ్ముడు ప్రదీప్ శెట్టర్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి తమ్ముడు గోవింద్ జోషి, ఎంపీ అనంతకుమార్ తమ్ముడు నందకుమార్‌తో పాటు హుబ్లీ-ధార్వాడ మాజీ మేయర్ వీరణ్ణ సవది, వ్యాపార వేత్త రమేష్ శెట్టి ప్రముఖ పాత్ర వహించారని ఆరోపించారు. ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్ట్ పాటిల్ పుట్టప్ప గత నెలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి వినతి పత్రాన్ని కూడా అందించారన్న హీరేమఠ్ ఆ వినతి పత్రం ప్రతులను విలేకరులకు అందజేశారు. హుబ్లీలోని ఈ ఆటమైదానాన్ని తక్షణమే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక ఆటమైదానం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
 
>
మరిన్ని వార్తలు