తాగునీటికి రూ.వెయ్యి కోట్లు

27 Jan, 2017 03:50 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు
► తీరాల్లో మారిన వాతావరణం
► బంగాళాఖాతంలో అల్పపీడనం
► భారీ వర్షం కురిసేనా?


సాక్షి, చెన్నై : రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రూ.వెయ్యి కోట్లను కేటాయించి, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నీటి సరఫరాకు తగ్గ కసరత్తులు వేగవంతం చేశారు. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతుండడంతో సముద్ర తీరాల్లో వాతావరణం మారింది. శుక్రవారం నుంచి వర్షాలు పడొచ్చన్న వాతావరణ కేంద్రం సమాచారంతో ఎదురుచూపులు పెరిగాయి. రాష్ట్రం కరువుతో తల్లడిల్లుతున్న విష యం తెలిసిందే. కరువు ప్రాంతంగా ప్రకటించినా, అన్నదాతలకు నష్టపరిహారం దరి చేర లేదు. కేంద్ర బృందా లు ఆగమేఘాలపై కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి.

ఈ పర్యటనలపై విమర్శలు, ఆరోపణలు బయలు దేరాయి. తమను సంప్రదించకుండా కేంద్ర బృందం పర్యటన సాగుతున్నదని, ఇక ఆత్మహత్యలే తమకు శరణ్యం అని రైతులు హెచ్చరిస్తుండడం, గురువారం కృష్ణగిరిలో మునియప్పన్  (52) రైతు ఆత్మహత్య చేసుకోవడం చూస్తే, రాష్ట్రంలో కరువు తాండవం ఏ మేరకు కోరల్ని చాచి ఉన్నదో స్పష్టం అవుతోంది. ఈ ప్రభావంతో వేసవిలో తాగునీటి కోసం ప్రజలు అలమటించే పరిస్థితి ఏర్పడింది. దీనిని ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యే పనిలో పడింది.

రూ.వెయ్యి కోట్లు : రాష్ట్రంలో తాగు నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులతో ముందస్తు చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. గ్రామస్థాయి మొదలు నగర స్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తగ్గకార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకుగాను రూ. వెయ్యికోట్లను కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు మెండుగా ఉన్న ప్రాంతాల్ని గుర్తించి, అక్కడ బోరు బావులు ఏర్పాటు చేయడం, నీళ్లు పుష్కలంగా ఉన్న బావుల్ని అద్దెకు తీసుకోవడం తదితర పనులకు ముందస్తుగా ఈ నిధుల్ని కేటాయించారు.

ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోరు బావుల ఏర్పాటు, అద్దెకు బావుల ఎంపిక కసరత్తుల్ని వేగవంతం చేయాలని జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు. నీటి పంపింగ్‌కు పైప్‌ లైన్లు, వాటార్‌ ట్యాంకర్లను ముందస్తుగా సిద్ధం చేయడానికి చర్యల్లో అధికారులు ఉన్నారు. ఇక, చెన్నైలో ఇప్పటికే మూడు వందల బావుల్ని అద్దెకు ఎంపిక చేసి ఉండగా, మరో మూడు వందల బావుల్ని ఎంపిక చేయడానికి నిర్ణయించారు.

వర్ష సూచన : ఈశాన్య రుతు పవనాలు సైతం ముఖం చాటేయడంతో రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తమిళనాడు వైపుగా వర్షాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్న సమాచారంతో ఎదురుచూపులు పెరిగాయి. అండమాన్  సమీపంలో నెలకొన్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ చెన్నై– ఆంధ్రా వైపుగా వాయువ్య దిశలో పయనిస్తుందని భావించారు. అయితే, అది నైరుతి దిశలోకి పయనం మార్చుకోవడంతో మన్నార్‌ వలికుడ వద్ద కేంద్రీ కృతమై ఉంది.

ఈ ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో శుక్రవారం నుంచి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావం కాబోలు రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఇక, నాగపట్నం జిల్లాలో సముద్రంలో అలల తాకిడి క్రమంగా పెరుగుతుండడంతో జాలర్లు చేపల వేటకు దూరంగా ఉన్నారు. వర్షం సైతం పడుతుండడంతో, క్రమేనా ఇది బలపడ్డ పక్షంలో కొంత మేరకు నీటి ఎద్దడి నుంచి ఊరట కల్గిందుకు ఆస్కారం ఉంది. ఇక, డెల్టా జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి.

మరిన్ని వార్తలు