రేసింగ్‌కు కళ్లెం

22 Jun, 2017 07:06 IST|Sakshi
రేసింగ్‌కు కళ్లెం

♦ ఈసీఆర్‌లో మాటు
♦ లగ్జరీ కార్ల భరతం
♦ వంద మందికి జరిమానా
♦ ఐదు కార్లు సీజ్‌


ఈసీఆర్‌ రోడ్డులో అతివేగంగా దూసుకెళ్లే కార్ల భరతం పట్టే రీతిలో ఆర్టీవో వర్గాలురంగంలోకి దిగారు. సంపన్నుల పిల్లలతో పాటు అతివేగంగా దూసుకొచ్చిన కార్లను టార్గెట్‌ చేసి నిఘా వేశారు. వందకార్లను పట్టుకున్నారు. యాభై కార్లకు సుమారు లక్షన్నర రూపాయల మేరకు జరిమానాలు విధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

సాక్షి, చెన్నై:
చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు ఈసీఆర్‌ రోడ్డులో పయనం ఆహ్లాదకరమే. సముద్ర తీరం వెంబడి సాగే ఈ పయనంలో తళ తళమని రోడ్లు మెరుస్తుంటాయి. ఈ రోడ్డులో నిత్యం వాహనాలు అతివేగంగా దూసుకెళుతుంటాయి. రాత్రుల్లో అయితే, మోటార్‌సైకిల్, కార్ల రేసింగ్‌ జోరుగానే సాగుతుంటాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం స్పందించే పోలీసులు, తదుపరి యథారాజా తథా ప్రజా అని వ్యవహరించడం జరుగుతోంది. ఈ మార్గంలో నిత్యం సాగే ప్రమాదాల్లో విగత జీవులయ్యే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం అయితే, ఏకంగా అత్యంత ఖరీదైన పదిహేను కార్లు చెన్నై నుంచి ఈసీఆర్‌ రోడ్డులో పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లడాన్ని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. అతివేగంగా దూసుకెళ్తున్న ఈ కార్లతో ఇతర వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే ప్రజలకు ఏదేని ప్రమాదాలు తప్పదేమో అన్న ఆందోళన బయలు దేరింది.

ఈ కార్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. ఒక్కో కారు లక్షలు విలువ చే యడంతో పాటు అందులో ఉన్న వాళ్లు సంపన్నుల పిల్లలు కావడమే. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తొలుత తీసుకున్నా, తదుపరి చడీచప్పుడు కాకుండా వదలిపెట్టారు. అయినా, రేషింగ్‌ జోరుగానే సాగుతుండడంతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. దీంతో అధికారులు ముందస్తుగా మేల్కొన్నట్టున్నారు.

ఈసీఆర్‌లో మాటు:
ఆర్‌టీఏ అధికారులు యువరాజ్, విజయకుమార్, నెల్లయ్యన్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు ఇతర సిబ్బంది ఈసీఆర్‌ రోడ్డులో అక్కడక్కడ మాటు వేశారు. ముందుస్తుగా సిద్ధం చేసుకున్న పరికరాల మేరకు అతివేగంగా దూసుకొచ్చే వాహనాలను పసిగట్టారు. ఓ చోట తప్పించుకున్నా, మరోచోట ఆ కార్లు తమ వాళ్లకు చిక్కే రీతిలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయాన్నే అతి వేగంగా కార్లు దూసుకు రావడంతో వాటి వేగానికి కళ్లెం వేస్తూ ముందుకు సాగారు. అతి వేగంగా వచ్చిన కార్లను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సంపన్నులు, అధికారుల పిల్లలు అన్న తేడా లేకుండా జరిమానా మోత మోగించారు. 50 లగ్జరీ కార్లకు అయితే, ఏకంగా లక్షన్నర జరిమానా విధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

అలాగే, మరో వంద వాహనాలకు లక్ష వరకు జరిమానా విధించారు. ఐదు కార్లను సీజ్‌ చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలను గురువారం ఆర్టీఏ అ«ధికారులు ప్రకటించనున్నారు. ఇక, ఏదో మొక్కుబడిగా... మమా అనిపించడం కన్నా, ఈ ప్రక్రియ నిరంతర కొనసాగాలని, అప్పుడే నిర్భయంగా రోడ్డు మీదకు రాగలమని ఆ పరిసర వాసులు పేర్కొంటున్నారు. ఈ తనిఖీలు ఓ వైపు సాగితే, మరో వైపు నగరంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉందో, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జోరుగా సాగుతోందో పసిగట్టి, అందుకు తగ్గ చర్యలు తీసుకునే విధంగా నగర పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ నేతృత్వంలో ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులు పరుగులు తీశారు. ఆదివారం ప్రమాదరహిత చెన్నై నినాదంతో ముందుకు సాగిన పోలీసులు, ఇక, నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగతుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు