టార్గెట్ ‘కరుణ’!

8 Sep, 2015 08:09 IST|Sakshi
టార్గెట్ ‘కరుణ’!

- సభా హక్కుల ఉల్లంఘన
- ఫిర్యాదుపై సమీక్ష
- క్రమశిక్షణా సంఘం సమాలోచన


సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని అధికార పక్షం టార్గెట్ చేసింది. సభకు రాకుండానే, అసెంబ్లీ వ్యవహారాల్లో తలదూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదును స్పీకర్ ధనపాల్ పరిగణనలోకి తీసుకున్నారు. దీన్ని క్రమ శిక్షణా సంఘానికి పంపించారు. ఆ సంఘం ఆయన ప్రకటనల తీరుపై సమీక్షించి నివేదిక సిద్ధం చేస్తోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, అసెంబ్లీలో ప్రతి పక్షాల గళాన్ని నొక్కేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ధిక్కరిస్తే చర్యలు తప్పదన్నట్టుగా సస్పెన్షన్ వేటులు పడుతున్నాయి. ఇందుకు  ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, ఆ పార్టీ సభ్యులపై విధిస్తూ వస్తున్న సస్పెన్షన్లు ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఇక, సభ జరిగినప్పుడల్లా ప్రతి రోజూ డీఎంకే వాకౌట్ల పర్వాన్ని కొనసాగిస్తూనే వస్తున్నది. తమకు మాట్లాడే అవకాశమివ్వడం లేదని, తమ తీర్మానాలపై చర్చ సాగించడం లేదని ఆరోపిస్తూ ఈ పర్వాన్ని ఆ పార్టీ సభ్యులు కొనసాగిస్తూ వస్తున్నారు. సింగిల్ డిజిట్ సభ్యుల్ని కల్గిన ప్రతిపక్ష పార్టీలే సభ వ్యవహారాల్లో కలుసుకుంటున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీ మందిరంలోకి అడుగు పెట్టలేదు.

తిరువారూర్ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే.  వీల్ చైర్‌లో ఉన్న తనకు కూర్చునేందుకు వీలుగా సభలో ప్రత్యేక స్థలం కేటాయించాలన్న ఆయన అభ్యర్థను అధికార పక్షం పట్టించుకోలేదు. దీంతో సభ జరిగినప్పుడు ఏదో ఒక రోజున లాబిలో ఉన్న పుస్తకంలో సంతకం చేసి అటే బయటకు వెళ్తుండం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండానే, ఆయన సభా వ్యవహారాల్లో తలదూర్చుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణను అన్నాడీఎంకే వర్గాలు తెరమీదకు తెచ్చాయి. ఇటీవల సభలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కరుణానిధిపై సభ హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో స్పీకర్‌కు ఫిర్యాదు చేరింది.
 
సభా హక్కుల ఉల్లంఘన


అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వైద్యలింగం చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ, అందులోని తప్పుల తడక, అనుచిత వ్యాఖ్యల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినేత ఎం.కరుణానిధి గత నెల ముఫ్పైన ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న మంత్రి వైద్యలింగం డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని టార్గెట్ చేశారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని ఖండించే విధంగా, అసెంబ్లీ వ్యవహారాల్ని ధిక్కరించే రీతిలో కరుణానిధి ప్రకటన ఉందంటూ స్పీకర్ ధనపాల్‌కు మంత్రి వైద్యలింగం ఫిర్యాదు చేశారు. సభలో సందించాల్సిన ప్రశ్నల్ని, సభలోనే లేల్చుకోవాల్సిన అంశాల్ని బజారుకీడ్చే రీతిలో కరుణానిధి విమర్శలు ఆరోపణలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని పరిగణించి స్పీకర్ ధనపాల్ విచారణకు ఆదేశించారు.
 
సమాలోచన


అసెంబ్లీ క్రమ శిక్షణా సంఘానికి అధ్యక్షులుగా డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే విజయ ధరణి, డీఎండీకే తరపున ఎమ్మెల్యే బాబు మురుగవేల్, డీఎంకే తరపున కంబం రామకృష్ణన్‌లతో పాటుగా సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ధనపాల్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై సమాలోచించింది చర్యకు ఆ సంఘం సిద్ధమయింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ అధ్యక్షతన కమిటీ సమావేశమయింది.

ప్రధాన ప్రతి పక్ష నేత సభకు రావడం లేదు కాబట్టి, ఆ పార్టీ ఎమ్మెల్యే బాబు మురుగవేల్ సస్పెన్షన్ వేటు కారణంగా సమావేశానికి దూరం కాక తప్పలేదు. మెజారిటీ శాతం మంది అన్నాడీఎంకే సభ్యులే ఈ సంఘంలో ఉండడంతో కరుణానిధి ప్రకటనపై తీవ్రంగానే స్పందించి ఉంటారన్నది గమనార్హం. కరుణానిధి వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించి, నివేదికసిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను స్పీకర్ ధనపాల్‌కు సమర్పించి, తదనంతరం కరుణానిధిపై చర్యకు రంగం సిద్ధ చేస్తున్నారు. అయితే, ఏ ప్రాతిపదికన కరుణానిధిపై చర్య తీసుకుంటారోనన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు