మరిన్ని చిక్కుల్లో సల్మాన్ ఖాన్

6 May, 2014 22:36 IST|Sakshi
మరిన్ని చిక్కుల్లో సల్మాన్ ఖాన్

 సాక్షి ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసు ఊబిలో మరింత కూరుకుపోయారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ప్రత్యక్షసాక్షులు ఘటనాస్థలిలో ఆగిన కారు నుంచి సల్మాన్ దిగారని తెలిపారు. కాగా, 2002లో బాంద్రా క్వార్టర్ రోడ్డు ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిని సల్మాన్‌ఖాన్ కారు ఢీకొట్టింది. వేగంగా కారు నడపడంతోపాటు మద్యం సేవించి కారు నడిపినట్టు సల్మాన్‌పై ఆరోపణలున్నాయి.

ఇంతకుముందే ఈ ఘటనపై కేసులో విచారణ జరిగినా ఎటూ తేలకపోవడంతో న్యాయస్థానంలో  తాజాగా విచారణ ప్రారంభమైంది. మంగళవారం సల్మాన్ ఖాన్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షులైన ముస్లీం శేఖ్, మున్ను ఖాన్‌లు కూడా కోర్టుకు వచ్చారు. విచారణ సమయంలో వీరిద్దరు సల్మాన్‌ను గుర్తించడంతోపాటు ఆ సమయంలో తీవ్రంగా మద్యంసేవించి ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత మద్యం మత్తులోనే కారునుంచి బయటికి దిగినట్టు కూడా చెప్పారు. దీంతో సల్మాన్‌ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది.  

గతంలో ఈ ‘హిట్ అండ్ రన్’ సంఘటనకు సంబంధించి పలుమార్లు కోర్టుకు హాజరుకావలని పేర్కొంది. అయినప్పటికీ 80సార్లకుపైగా కోర్టుకు సల్మాన్ ఖాన్ హాజరుకాలేదు.  సామాన్యులకు ఓ న్యాయం, సల్మాన్ ఖాన్‌కు మరో న్యాయం ఇలా ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నను మాజీ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్, ఆయన సతీమణీ తెరమీదికి తీసుకువచ్చారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ముంబై పోలీసులపై ఆరోపణలు గుప్పించడంతోపాటు కేసు కూడా నమోదుచేశారు. దీంతోపాటు ఇతర అనేక కార ణాల వల్ల  కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాజా దర్యాప్తులో సాక్షులు సల్మాన్‌ను గుర్తుపట్టడంతో ఇబ్బందులు అధికమయ్యాయని తెలుస్తోంది. ఒకవేళ హిట్ అండ్ రన్ కేసులో హత్యా నేరం రుజువైతే అతడికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు