మేనిఫెస్టోల్లో మాకు చోటేదీ?

25 Apr, 2014 23:37 IST|Sakshi

రాజకీయ పార్టీలకు హక్కుల సంఘాల ప్రశ్న
 
 న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో మహిళల రక్షణ అంశాన్ని రాజకీయ పార్టీలు ఎందుకు పక్కకు పెట్టాయని మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ‘‘భారత ఎన్నికల ప్రణాళిక చాలా చిన్నది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలపై నేరాల అంశం రెండో అంశంగా పరిగణింపబడుతోంది, అవినీతి ప్రధానాంశమైంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు సుప్రీకోర్టు న్యాయవాది కరుణా నంది.  మహిళల రక్షణ కోసం పనిచేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

 ఎన్జీవో అనంత సెంటర్, మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమాన్సిప్ యాక్షన్ ఇండియా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భారతదేశంలో మహిళలపట్ల పురుషల ప్రవర్తన, విద్యావకాశాలు, ఆర్థికావకాశాలు, కళలు-మీడియాలో మహిళలు, చట్టాలు-అవి అమలవుతున్న తీరువంటి అనేక అంశాలపై జరిగిన చర్చల్లో దేశ నలుమూలలనుంచి వచ్చిన అన్ని రంగాల్లోని మహిళలు పాల్గొన్నారు. మహిళలపై హింస అంతమొందించడం కోసం నాయకులను ప్రశ్నించాలని కరుణానంది కోరారు.

వందల  ఏళ్లుగా సమాజంలో, మనలో పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థను అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వాలు దీన్ని ప్రాధాన్యతలేని అంశంగా చూస్తున్నాయని, మహిళల అంశాలపట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం దారుణమని కరుణా నంది విమర్శించారు.

 మహిళలపై హింసకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చైతన్యం ఇంకా పెరగాల్సి ఉందని హెచ్‌ఎస్‌బీసీ కంట్రీ హెడ్ నైనా లాల్ కిద్వాయ్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత సంపూర్ణం కావాలంటే మహిళల ఆర్థిక స్వావలంబన, భూమి కలిగి ఉండడం ప్రధానమని సామాజిక కార్యకర్త మీరాయ్ ఛటర్జీ అన్నారు.ఆర్థిక సాధికారత అంటే కేవలం మహిళల చేతికి డబ్బు వెళ్లడమే కాదని, ఆహారం, సామాజిక భద్రత, పిల్లల రక్షణ, పెన్షన్, ఇల్లు... ఇలా ఇంట్లోనే కాదు... సమాజంలో మార్పు సంభవిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు