అలా చేస్తే తప్పేంటి?

10 Feb, 2015 01:05 IST|Sakshi
అలా చేస్తే తప్పేంటి?

 మార్కెట్ ఉన్నప్పుడు అధిక పారితోషికం డిమాండ్ చేస్తే తప్పేంటి అంటోంది సమంత. కత్తి చిత్రంతో హిట్ కథనాయకిగా పేరు తెచ్చుకున్న సమంతకు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ఒక తెలుగు చిత్రం కోసం కోటిన్నర పారితోషికాన్ని డిమాండ్ చేసి, ఆ చిత్ర నిర్మాతకు ముచ్చెమటలు పట్టించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై స్పందించిన సమంత, చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా కథానాయకుల హవానే సాగుతున్నది పేర్కొన్నారు.
 
 చిత్రాల్లో వారికే ప్రాధాన్యత ఉంటుందని, హీరోయిన్లను చెట్లు, పుట్టల వెంట తిరిగే ప్రేమ పాత్రలకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. హీరోలను చూడటానికి వచ్చే ప్రేక్షకుల మాదిరిగానే తమను చూడటానికి ఒక వర్గం ఉంటుందని పేర్కొన్నారు. అలాంటిది తమను తక్కువగా చూడటం భావ్యమా అని ప్రశ్నించారు. హీరోయిన్లు ఇష్టం వచ్చినట్టు పారితోషికం డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోందన్నారు.
 
 తమ చిత్రాలు విజయవంతం అవుతున్నప్పుడు అధిక పారితోషికం డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదని పేర్కొంది. ఒక వేళ చిత్రాలు పరాజయం పొందితే, తమకు అవకాశాలు ఇవ్వడానికి వెనుకాడతారని, అలాంట ప్పుడు పారితోషికం విషయంలో బేరసారాలు ఆడుతున్నారని ఆరోపించారు. అయితే ధనార్జనే తన లక్ష్యంగా ఎవరూ భావించరాదన్నారు. వైవిధ్య భరిత కథా పాత్రలు లభిస్తే పారితోషికం లేకుండా నటించేందుకు సిద్ధమేనన్నారు.

మరిన్ని వార్తలు