భివండీలో ‘సమితి’ ఎన్నికలు

1 Aug, 2013 03:49 IST|Sakshi

 భివండీ కార్పొరేషన్‌లోని మహిళా, శిశు సంక్షేమ సమితి, గల్లీ సుధారణ సమితికి సంబంధించి సభాపతి, ఉప సభాపతి పదవులకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి, డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ వోక్ అధ్యక్షతన ఈ ఎన్నికలు జరిగాయి. భివండీ కార్పొరేషన్ ఎన్నికలు 2012, ఏప్రిల్ 15న జరిగాయి. నిబంధనల ప్రకారం ఈ పదవులకు రెండు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఏకంగా 15 నెలల అనంతరం నిర్వహించడం గమనార్హం.

ఇదిలా ఉండగా మహిళా, శిశు సంక్షేమ సమితి, గల్లీ సుధారణ సమితి సభాపతి, ఉప సభాపతి పదవులకు ఇద్దరేసి నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మహిళా, శిశు సంక్షేమ సమితికి గాను సభాపతి పదవికి షేక్ శఖీరాబానే ఇంతియాజ్ తమ నామినేషన్ విరమించుకోవడంతో సునితా యశ్వంత్ టావురే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఉపసభాపతి పదవికి ఊర్మిళ విజయ్ చౌదరి తన నామినేషన్ విరమించుకోవడంతో అన్సారీ మహబూబ్ రహమాన్ ఏకగ్రీవమయ్యారు. గల్లీ సుధారణ సమితి సభాపతి పదవికి ముగ్గురు నామినేషన్లు దాఖలు  చేశారు. ఇందులో మనీశా సునిల్ దాండేకర్ తన నామినేషన్ విరమించుకోగా వికాస్ సకారామ్ నికమ్, సుజాతా ఉప్పమ్ జగతాప్ బరిలో నిలిచారు. వీరిలో వికాస్ సకారామ్ నికమ్ ఒక్క ఓటు ఆధిక్యతతో గెలుపొందారు.
 
 అదేవిధంగా ఉప సభాపతి పదవికి అన్సారీ మెహరున్సిసా ఉస్మాన్ గనీ, అన్సారీ సాజిత్ హుస్సేన్ పోటీపడగా అన్సారీ మెహరున్సిసా ఉస్మాన్ గనీ ఒక్క ఓటు అధిక్యంతో గెలుపొందారు. విజేతలకు డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ వోక్ అధికారికంగా పదవీ బాధ్యతలు అప్పగించారు.అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభాపతి, ఉపసభాపతులుగా గెలుపొందినవారికి మద్దతు తెలిపిన కార్పొరేటర్లు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు