ఇసుక దుమారం

6 Jul, 2016 03:52 IST|Sakshi

ఇసుక అక్రమ రవాణాపై మండలిలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
అరికట్టలేమని అధికారులే చేతులెత్తేశారు

మంత్రుల కుమారులే అక్రమార్కులు  !
మండలిలో కే.ఎస్ ఈశ్వరప్ప
సెప్టెంబర్ 30 లోపు చెల్లిస్తే సహకార రుణాల వడ్డీ మాఫీ : మంత్రి మహదేవ

     

బెంగళూరు: శాసన మండలిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అధికార విపక్షాల మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం చెలరేగింది. సభా కార్యక్రమాల్లో భాగంగా మండలి విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ... మైసూరు, కోలారు జిల్లా పర్యటనలో భాగంగా ఇసుక అక్రమ రవాణా విషయమై అక్కడి కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రశ్నించానని తెలిపారు. ఇందుకు వారు తాము నిస్సాహాయులమని చేతనైతే చట్టసభల్లో ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయండని పేర్కొన్నారన్నారు. దీంతో అక్కడే ఉన్న ఇందన శాఖ మంత్రి డీ.కే శివకుమార్ ‘మీరు మంత్రులుగా పనిచేశారు. ఏ అధికారైనా అలా మాట్లాడుతారా? మీరు కల్పించుకుని చెప్పకండి!’ అని పేర్కొన్నారు. ఇందుకు ప్రతిస్పందించిన కే.ఎస్ ఈశ్వరప్ప ‘అమ్మతోడు జిల్లా అధికారులే అలా అన్నారు. మంత్రుల కుమారులు కూడా కొంతమంది ఈ ఇసుక అక్రమ రవాణా దందాలో భాగస్వాములై ఉన్నారు.’ అని  పేర్కొన్నారు. ఇందుకు విపక్ష ఎమ్మెల్సీలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ సమయంలో అధికార విపక్ష నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. చివరికి సభాపతి డీ.హెచ్ శంకరమూర్తి కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా ఉభయ సభల్లో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలు అందుకు సంబంధిత మంత్రులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి...

 
టోల్‌గేట్లలో అంబులెన్స్, వీఐపీ వ్యక్తులకు సంబంధించిన వాహనాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రయాణం చేయడానికి వీలుగా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ప్రజాపనుల శాఖ మంత్రి మహదేవప్ప తెలిపారు.

 
రాష్ట్రంలోని వివిధ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు అసలును ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని మహదేవప్ప పరిషత్‌కు తెలియజేశారు.

 
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన పౌరకార్మికుల సేవలను క్రమబద్ధం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రీ తెలిపారు.

 
రైతులపై ఒత్తిడి తీసుకువచ్చి వారి బలవన్మరణాలకు పాల్పడడానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 1,332 మందిపై కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు.

 
ఆన్‌లైన్‌లో వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే విషయమై ప్రణాళికలు రచిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు.

 
ప్రతి తాలూకా కేంద్రంలో పశువుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి ఏ.మంజు పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు