విద్యుత్ రంగంలో సంస్కరణలు

28 Jan, 2014 23:00 IST|Sakshi

ముంబై: విద్యుత్ కొనుగోలు, పంపిణీలలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకుగాను ఆ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఎంపీ సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు మంగళవారం ఈ మేరకు ఓ లేఖ రాశారు. విద్యుత్ సంస్థల పనితీరు, చార్జీలను నిర్ణయించడం వంటి అంశాలను సంస్కరణలు నియంత్రించేవిధంగా ఉండాలన్నారు.

 ఆవిధంగా జరిగితే వినియోగదారులు లబ్ధిపొందుతారన్నారు. విద్యుత్ బిల్లులు ఇతర అనేక చార్జీలను జత చేసే విధానాన్ని రద్దు చేయాలని తన లేఖలో సంజయ్ డిమాండ్ చేశారు. నగరానికి చెందిన విద్యుత్ వినియోగదారులకు కూడా రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 26 లక్షలమంది వినియోగదారులకు రాయితీ ఇవ్వాలనే మీ ఆలోచన వల్ల సామాన్యుడికి మేలు కలుగుతుందని, వారి ఇక్కట్లు కొంతమేర తొలగిపోతాయన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగేరీతిలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు.

 బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వినియోగదారుల లబ్ధి కోసం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించిందని నిరుపమ్ గుర్తుచేశారు. గుత్తాధిపత్యానికి తెరదించాలనేదే ప్రైవేటీకరణ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విద్యుత్ కొనుగోలు, చార్జీలను నిర్ణయించే విధానంలో లోపాలను గుర్తించడం అత్యంత కష్టమని అభిప్రాయపడ్డారు.

విద్యుత్ సంస్కరణలనేవి నియంత్రణ సంస్థపై తప్పనిసరిగా దృష్టిసారించేవిగా ఉండాలన్నారు. ఎటువ ంటి సాంకేతిక పరిజ్ఞానముగానీ లేదా నైపుణ్యంగానీ లేని విశ్రాంత ఐఏఎస్ అధికారులను నియంత్రణ సంస్థలో సభ్యులుగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అసలు ఈ రంగంలోకి అనేకమంది అనేక సంస్థలను ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు.

మరిన్ని వార్తలు