చిన్న తరహా పరిశ్రమలకు సర్కార్ చేయూత

6 Sep, 2013 02:42 IST|Sakshi

 గదగ్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు పూర్తిగా పతనావ స్థలో ఉన్నాయని, వాటిని పారిశ్రామికవేత్తలు సవాల్‌గా స్వీకరించి పునఃశ్చేతనానికి నడుం బిగిస్తే ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖామంత్రి హెచ్‌కే పాటిల్ అన్నారు. ఆయన గురువారం నగరంలోని తోంటధార్య కల్యాణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గదగ్ ఉత్సవం, పారిశ్రామిక వస్తు ప్రదర్శన, విక్రయ మేళాను ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఉత్పత్తి పోటీల మధ్య చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు దుస్థితిలో ఉన్నాయన్నారు. అందువల్ల వాటిని కాపాడుకోవడం పారిశ్రామికవేత్తల బాధ్యత అన్నారు.

అలాంటి పరిశ్రమల పునః ప్రారంభానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ ఏడాది రెండు లక్షల మంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ పరిశ్రమల స్థాపనకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. అయితే పర్యావరణం, అక్కడి రైతుల ప్రయోజనాలు కాపాడటం అత్యవసరమన్నారు.

నగరంలో గత 12 ఏళ్లుగా గదగ్ ఉత్సవం చేపట్టడం చేతి వృత్తులు, భారీ, చిన్న తరహా పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించడం శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజశేఖర్ శిరూర్, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శివకుమార్, గదగ్ ఉత్సవ అధ్యక్షుడు సంగమేష్ దుందూర్, శివప్రకాష్ మహాజనశెట్టర్, రాజు కురడగి తదితరులు పాల్గొన్నారు.  కాగా ఐదు రోజుల పాటు జరిగే గదగ్ ఉత్సవంలో 80కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
 

మరిన్ని వార్తలు