ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి

14 Feb, 2017 18:17 IST|Sakshi
ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి

చెన్నై: జయలలిత మృతిపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ, శశికళపై విమర్శలు చేస్తూ వస్తున్న సినీ నటి గౌతమి.. సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. శశికళ కువతూర్‌ నుంచి నేరుగా బెంగళూరులోని పరపణ అగ్రహార జైలుకు వెళ్లకతప్పదని అన్నారు. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వేదనిలయానికి వెళ్లే నైతిక అర్హత శశికళకు లేదని ట్వీట్ చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటిస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన సమయంలో శశికళ కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు. కోర్టు తీర్పును గౌతమి స్వాగతిస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అవినీతి కేసులో శశికళను దోషీగా నిర్ధారించారని పేర్కొంటూ, అమ్మ మృతిపై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులను వేరుగా పరిగణించాలని ట్వీట్ చేశారు.

జయలలిత చికిత్స, మరణంపై సందేహాలు వ్యక్తం చేసిన గౌతమి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సైతం రెండు సార్లు లేఖలు రాశారు. అమ్మకు న్యాయం చేయాలని పలు వేదికలపై డిమాండ్ చేశారు. అలాగే శశికళకకు వ్యతిరేకంగా, పన్నీరు సెల్వంకు మద్దతుగా గౌతమి గళం విప్పారు. శశికళ ఇదే కేసులో గతంలో పరపణ అగ్రహార జైల్లో 6 నెలలు ఉన్నారు.