'శశికళను మామూలుగా చూడండి.. లీకులొద్దు'

19 Jul, 2017 18:48 IST|Sakshi
'శశికళను మామూలుగా చూడండి.. లీకులొద్దు'

బనశంకరి(కర్ణాటక): ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా పకడ్బందీగా పనిచేయాలని పరప్పన అగ్రహార జైలు అధికారులకు జైళ్ల ఏడీజీపీ ఎన్‌ఎస్‌ మేఘరిక్‌ గట్టి హెచ్చరికలు చేశారు. జైళ్ల విభాగం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా బుధవారం పరప్పన సెంట్రల్‌ జైలును సందర్శించిన మేఘరిక్‌ అన్ని విభాగాలను పరిశీలించి, అధికారులతో సమావేశమయ్యారు. కారాగారంలో పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని చెప్పారు. ఖైదీలకు జైలు సూచనల ప్రకారం సౌలభ్యాలు కల్పించాలని, ఎవరికీ నిబంధనలకు వ్యతిరేకంగా వసతులు కల్పించరాదని హెచ్చరించారు.

ఖైదీలతో ములాఖత్‌కు వచ్చేవారు తెచ్చే వస్తువులను ఆధునిక పరిజ్ఞానంతో తనిఖీ చేయాలని, ఆ వస్తువులను ఎవరికి, ఎందుకోసం తెచ్చారో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అన్నా డీఎంకే నాయకురాలు శశికళను ఇతర ఖైదీల తరహాలోనే పరిగణించాలని, ఆమెకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించరాదని చెప్పారు. జైలు లోపలి దృశ్యాలను చిత్రీకరించి వాటిని మీడియాకు లీక్‌ చేయడం తగదని హెచ్చరించారు. సైకో శంకర్‌ పారిపోయిన అనంతరం జైళ్ల గురించి అధ్యయనం చేయడానికి  ఏర్పాటు చేసిన కమిటిలో సభ్యుడిగా తనకు జైలు వ్యవస్థ, నిర్వహణ పట్ల అవగాహన ఉందన్నారు.

ఐపీఎస్‌ అధికారిగా సుదీర్ఘ అనుభవం కలిగిన తనతో ఏ విషయాన్నయినా పంచుకోవచ్చని అధికారులకు సూచించారు. ఖైదీల సమస్యలపట్ల జైలు అధికారులు ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని, కానీ మీడియాకు లీక్‌ చేస్తే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జైలు నియమాలను అనుసరించి తాను విధులు నిర్వహిస్తానని తెలిపారు. జైలు సిబ్బందితో పాటు కొందరు ఖైదీలతోనూ చర్చించి జైలు ప్రక్షాళనకు నడుం బిగిస్తానని మేఘరిక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు