చిన్నమ్మకే అన్నా డీఎంకే పగ్గాలు

15 Dec, 2016 17:24 IST|Sakshi
చిన్నమ్మకే అన్నా డీఎంకే పగ్గాలు

చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో ఎవరు పగ్గాలు చేపడుతారన్న విషయంపై పూర్తిగా స్పష్టత వచ్చింది. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ పార్టీని నడిపిస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అన్నా డీఎంకే తదుపరి ప్రధాన కార్యదర్శిగా 54 ఏళ్ల శశికళ బాధ్యతలు చేపడుతారని పార్టీ ప్రతినిధి పొన్నయన్‌ గురువారం ప్రకటించారు. పార్టీ నాయకులందరూ ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అవసరమైతే పార్టీ నిబంధనలను సవరిస్తామని చెప్పారు.

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా రెండు బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణానంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణం చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులవుతారని పార్టీకి చెందిన జయ టీవీ కథనం ప్రసారం చేసింది. సీఎం పన్నీరు సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై సహా మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు.. శశికళను కలసి పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరారు. దీంతో జయ స్థానంలో శశికళ పార్టీని నడిపిస్తారని వార్తలు వచ్చాయి. ఈ రోజు పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించడంతో పూర్తిగా స్పష్టత వచ్చినట్టయ్యింది. జయలలితతో కలసి పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న శశికళ.. ఆమె మరణానంతరం అక్కడే ఉంటున్నారు.