జయ కోసం శశి పూజలు

26 Jan, 2016 11:52 IST|Sakshi
జయ కోసం శశి పూజలు

భర్తల గెలుపు కోసం భార్యల మొక్కులు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
 
గెలుపు ఓటములు దైవాధీనాలు అనే నానుడికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రంలోని రాజకీయ నేతలు.  అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలే దిక్కు అని భర్తలు... ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా, వారి భార్యలు మాత్రం తమ భర్తల గెలుపు కోసం దేవుడే దిక్కని ఆలయాల్లో ప్రదక్షిణలకు శ్రీకారం చుట్టారు.

 
చెన్నై : విద్యార్థులకు పరీక్షలో ఉత్తీర్ణత ఎంత ముఖ్యమో రాజకీయ నేతలకు ఎన్నికల్లో గెలుపు అంతే ముఖ్యం. పరీక్షా ఫలితాల్లో ఫెయిలైనా, ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలైనా పరిస్థితి దయనీయమే. అందుకేనేమో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా ఓటరు బాట, నేతల సతీమణులంతా ఆలయాల బాట పట్టడం ప్రారంభించారు.

అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం అన్నాడీఎంకే, డీఎంకేలలో చురుకుగా సాగుతోంది. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రెండు పార్టీల్లోనూ ఎగబడుతున్నారు. గెలుపు ఓటములు దైవాధీనాలనుకుంటూ రాజకీయ నేతలు ప్రజల వైపు తాము పయనిస్తూ తమ సతీమణులను ఆలయాల చుట్టూ తిప్పుతున్నారు.   
           
జయ కోసం శశికళ
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు కోసం ఆమె నెచ్చెలి శశికళ ఈ నెల 20వ తేదీన శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ అమ్మవారి ఆలయంలో బంగారు విమాన కుంభాభిషేకం ఉత్సవాలు నిర్వహించారు.

యుద్ధంలో గెలుపు కోసం ఆలయాల్లో మాంగల్య పూజలు నిర్వహించి ముత్తయిదువులకు ప్రసాదాలు పంచడం రాజుల కాలం నాటి ఆనవాయితీ. అదే ఆనవాయితీగా ఆలయ కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న శశికళ... జయ గెలుపును ఆశిస్తూ విశేష పూజలు నిర్వహించారు. 25 మంది మహిళా భక్తులకు రవిక వస్త్రం, తాళిబొట్టు తాడు, పసుపు, కుంకుమ తదితర 9 రకాల వస్తువులతో కూడిన సంచీని అందజేశారు.
 
స్టాలిన్ కోసం సతీమణి దుర్గ
శశికళ పూజల సంగతి తెలిసిందో ఏమో కాని డీఎంకే అధినేత కరుణానిధి కోడలు, కోశాధికారి స్టాలిన్ సతీమణి దుర్గ పక్కరోజే కంచి కామాక్షి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. డీఎంకే అధికారంలో రావాలని ప్రార్థిస్తూ    తైమాస పౌర్ణమిరోజైన శనివారం అర్ధరాత్రి కంచిలోని కామాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.

చోళరాజులు తాము రణరంగంలోకి దిగే ముందు కామాక్షి అమ్మవారికి నవ ఆవర్ణ పూజలు జరిపేవారు. స్టాలిన్ భార్య దుర్గ సైతం నవ ఆవర్ణ పూజ జరిపించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన పూజలు అర్ధరాత్రి వరకు సాగాయి. దుర్గతోపాటూ ఆమె తల్లి, సోదరి కూడా పూజల్లో పాల్గొన్నారు.
 
అన్బుమణి కోసం భార్యామణి సౌమ్య  
కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే తరఫున సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన అన్బుమణి రాందాస్ సతీమణి సౌమ్య సైతం ధర్మపురి జిల్లా కుమారస్వామిపేటలోని శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తన భర్త సీఎం అయ్యేలా ఆశీర్వదించు అంటూ తైపూస పుణ్యదినమైన ఆదివారం నాడు సౌమ్య ప్రత్యేక పూజలు జరిపారు.

ఇలా మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతల గెలుపు కోసం వారి సతీమణులు, జయ కోసం ఆమె నెచ్చెలి శశికళ వరుసగా పూజలు జరిపించడం విశేషం. ఇదే కోవలో తన భర్తకు పోటీకి సీటు దక్కాలని, గెలుపొందాలని, పార్టీ అధికారంలోకి వస్తే భర్త మంత్రి కావాలని... ఇలా రకరకాల కోర్కెలతో ఇక ఆలయాల్లో నేతల సతీమణులు సందడి చే యడం ఖాయమని అంటున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా