ముందస్తుగా..

30 Mar, 2018 09:45 IST|Sakshi
శశికళ

ముందస్తుగానే పరప్పన అగ్రహార చెరకు వెళ్లేందుకు చిన్నమ్మ శశికళ నిర్ణయించారు. శనివారం సాయంత్రం ఆమె తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం కానున్నా రు. శుక్రవారం నటరాజన్‌ మృతికి కర్మక్రియలు జరగనున్నాయి.

సాక్షి, చెన్నై: భర్త నటరాజన్‌ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్‌ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె నటరాజన్‌ స్వగ్రామంలో కాకుండా తంజావూరులో ఉంటున్నారు. ఆమెను పరామర్శించేందుకు రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివస్తున్నారు. గురువారం అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలు చిన్నమ్మను పరామర్శించారు. గంటపాటు చిన్నమ్మతో వారు భేటీ అయ్యారు. ఈ సమయంలో కళగం ఉప ప్రధానక కార్యదర్శి దినకరన్‌ సైతం అక్కడే ఉన్నారు. ఈసందర్భంగా నాయకులు, మద్దతుదారుల్ని ఉద్దేశించి చిన్నమ్మ కొన్ని సూచనల్ని చేసినట్టు సమాచారం. దినకరన్‌కు మద్దతుగా అందరూ నిలవాలని, మరో ఏడాదిలో తాను జైలు నుంచి వచ్చేస్తాననని, ఆ తర్వాత పార్టీ తప్పకుండా చేతుల్లోకి వస్తాయని ఆందోళన చెందవద్దన్న భరోసా ఇచ్చినట్టు సమాచారం. తాను వచ్చాకా, అన్ని సక్రమంగా సాగుతాయని, అంతవరకు ధైర్యంగా ఉండాలని,  ఈ కాలంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, వాటన్నింటినీ ఎదుర్కోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ సమయంలో చిన్నమ్మ మేనల్లుడు వివేక్‌ అక్కడకు వచ్చినట్టు వచ్చి దినకరన్‌ ఉండడంతో క్షణాల్లో వెనుదిరగడం చర్చకు దారితీసింది. అలాగే, చిన్నమ్మ సోదరుడు దివాకరన్‌ సైతం మౌనంగాఅక్కడి నుంచి వెళ్లడంతో కుటుంబ విభేదాలు కొట్టచ్చినట్టు కనిపించడం గమనార్హం.

పెరోల్‌ కాలం వినియోగించుకోకూడదని..
తనకు కర్ణాటక జైళ్ల శాఖ 15 రోజుల బెయిల్‌ మంజూరు చేసినా, పూర్తి కాలం ఆ రోజుల్ని వినియోగించుకునేందుకు శశికళ ఇష్ట పడలేదు. ముందుగానే ఆమె జైలుకు వెళ్లేందుకు నిర్ణయించడం గమనార్హం. శుక్రవారం విలార్‌ గ్రామంలో నటరాజన్‌ మృతికి కర్మకాండ జరగనుంది. ఇందుకోసం ఉదయాన్నే ఆగ్రామానికి శశికళ వెళ్లనున్నారు. ఆ తదుపరి తంజావూరు చేరుకుని నటరాజన్‌ చిత్ర పట  ఆవిష్కరించనున్నారు. శనివారం సాయంత్రం అందరి వద్ద సెలవు తీసుకుని తంజావూరు నుంచి బెంగళూరుకు పయనం అయ్యేందుకు ఆమె నిర్ణయించి ఉన్నట్టు మద్దతుదారులు పేర్కొన్నారు. కాగా, తన కుటుంబంలో దివాకర్, వివేక్‌ల రూపంలోనే వివాదాలు తెరమీదకు వస్తున్నట్టు చిన్నమ్మ గుర్తించారని, అందుకే వివాదాలు మరింత పెద్దవి కాక ముందే జైలుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా, చిన్నమ్మను ఎవరెవరు వచ్చి పరామర్శిస్తున్నారో అన్న వివరాలను కర్ణాటక జైళ్ల శాఖ సేకరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, వచ్చి వెళ్లే వారితో పాటు, తంజావూరు ఇంటి వద్ద వీడియో చిత్రకరణ సాగడం గమనార్హం.

మరిన్ని వార్తలు