చెరసాలేనా చిన్నమ్మ?

5 Feb, 2020 08:15 IST|Sakshi

గుదిబండగారూ.10 కోట్ల జరిమానా

మూడేళ్లయినా చెల్లించని వైనం

మరో ఏడాది జైలు జీవితం తప్పదా?

నాలుగేళ్ల శిక్ష ముగింపు దశకు చేరుకుంది. జైలు నుంచి విముక్తిపై శశికళ చుట్టూ కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి. జరిమానా రూపంలో చిన్నమ్మ చిక్కుల్లో పడ్డారు. జరిమానా చెల్లించనట్లయితే అదనంగా ఏడాది పాటు జైలు జీవితం తప్పదని నిపుణులు చెబుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్‌లో ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పింది. ఇదే కేసులో సహ నిందితులైన జయ నెచ్చెలి శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్‌కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ఏడాదిపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుపై రెండేళ్ల పాటు అప్పీళ్లపై అప్పీళ్లతో శిక్ష అమలులో జాప్యం చోటుచేసుకుంది. 2016 డిసెంబర్‌లో జయలలిత కన్నుమూయగా 2017 ఫిబ్రవరి నుంచి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

పెద్ద మొత్తంలో జరిమానాకు గురైన వారు శిక్ష ముగిసే సమయంలోనే చెల్లిస్తారు. శశికళ వ్యవహారంలో చెక్‌ లేదా డీడీ రూపంలో జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియబరుస్తూ ఆదాయపు పన్నుశాఖకు ఆదారాలు చూపి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ను జతచేసి చెల్లించాలి.  ఖైదీగా ఉన్న కాలంలో జైలు నిబంధనలకు అనుగుణంగా, క్రమశిక్షణతో వ్యవహరించినవారు శిక్షా కాలం నుంచి మినహాయింపు పొంది ముందుగానే విడుదలయ్యే వెసులుబాటు ఉంది. ఈ కేటగిరి కింద శశికళ  నాలుగేళ్లు ముగిసేలోపే విడుదలవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దోపిడీ, హత్య, అత్యాచారం కేసుల్లో 14 జైలుశిక్ష పడిన వారికి మాత్రమే ముందస్తు విడుదల వెసులుబాటు వర్తిస్తుంది.

అవినీతి కేసులో శిక్ష పడినవారు అందుకు అనర్హులని అంటున్నారు. శశికళ రూ.10 కోట్ల జరిమానా చెల్లించిన పక్షంలో 2021 జనవరి 25వ తేదీన జైలు నుంచి విడుదల అవుతారు. జరిమానా చెల్లించని పక్షంలో 2022 ఫిబ్రవరి 15వ తేదీ వరకు జీవితం గడపక తప్పదని జైళ్లశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు రెండేళ్ల కిత్రం శశికళ సొంత వ్యాపారాలు, బంధువుల వ్యాపార సంస్థలు, ఇళ్లపై దాడులు చేసి రూ.5వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు. ఈ పరిస్థితిలో రూ.10 కోట్ల జరిమానాను కరెన్సీ రూపంలో శశికళ చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ శశికళ బంధువులు, స్నేహితులు చెల్లించినా వారికి సైతం ఐటీ అధికారుల బెడద ఉంటుంది. శశికళ తరఫున అంతపెద్ద మొత్తాన్ని కట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. శశికళ రూ.10 కోట్లు జరిమానా చెల్లించి వచ్చే ఏడాది విడుదల అవుతారా..? లేక మరో ఏడాది పాటు జైల్లోనే ఉండిపోతారా..? అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు