డీజిల్ కార్లకు సుప్రీం అనుమతి

10 May, 2016 18:54 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2000 సీసీ కంటే ఎక్కువ సామర్ధ్యం కలిగిన కొత్త కార్ల వినియోగానికి మంగళవారం సుప్రీంకోర్టు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. డీజిల్ కార్లు సాధారణ వాహనాల కంటే ఎక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తాయని కోర్టు నమ్మిందనీ... ఈ విషయం తప్పు కూడా కావొచ్చని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇంజన్ సామర్థ్యం, కారు ధరను బట్టి ఓనర్లందరూ వన్ టైమ్ పర్యావరణ సెస్ కట్టాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రాజధాని ప్రాంతం నుంచి డీజిల్ కార్లను తొలగించడంపై ఢిల్లీ ప్రభుత్వం, వాతావరణ కాలుష్య పర్యవేక్షణ సంస్థ, టాక్సీ ఓనర్ అసోసియేషన్లను రోడ్ మ్యాప్ చూపాలని ఆదేశించింది. డీజిల్ కార్లు మాత్రమే వాతావరణ కాలుష్యానికి కారణం కాదని.. పెట్రోల్, సీఎన్జీలు కూడా కాలుష్యానికి కారణమవుతాయని, పెట్రోలు కార్లు కార్బన్ మోనాక్సైడ్, సీఎన్జీ కార్లు నైట్రోజన్ ఆక్సైడ్ లను విడుదల చేస్తాయని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. మేక్ ఇన్ ఇండియా పాలసీలో ఆటో మొబైల్ రంగానికి ప్రాధాన్యతనిచ్చారని, కాలుష్యం కారణంగా పాలసీని విరమించుకోలేమని రంజిత్ కోర్టుకు తెలిపారు.

2015లో ఐఐటీ కాన్పూర్ చేసిన సర్వే ఆధారాలను చూపుతూ.. దుమ్ము, సహజంగా మంటల కారణంగా వచ్చే కాలుష్యాన్ని ఎవరూ ఆపలేరని, డీజిల్ కార్లకు రాజధాని ప్రాంతంలో సడలింపునివ్వాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం లగ్జరీ కార్ల వినియోగానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు