బహిరంగ ప్రచారానికి తెర...

20 Aug, 2015 01:45 IST|Sakshi

బెంగళూరు:ృ బహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడింది. దీంతో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బీబీఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు నగరం ఆయా పార్టీల నేతల ప్రచారంతో హోరెత్తింది. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మొదలుకొని కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతలు ఇలా అందరూ బహిరంగ సమావేశాల్లో పాల్గొని ఒకరి వైఖరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అంతేకాక అభ్యర్థుల మద్దతుదారుల బైక్ ర్యాలీ, సైకిల్ ర్యాలీలు, బహిరంగ ప్రచారంతో నగరమంతా మారుమోగింది. ఇక బహిరంగ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో గడువు ముగియడంతో గురువారం నుంచి ఇంటింటి ప్రచారాన్ని అభ్యర్థులు చేపట్టనున్నారు.

 కాగా, పోలింగ్‌కు మరో  48గంటలు మాత్రమే సమయం ఉండడంతో శాంతి, భద్రతల నడుమ, పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ బూత్‌లలో అధికారుల నియామకం, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడం, పర్యవేక్షకుల నియామకంతో పాటు ఈవీఎంలను ఎన్నికల కమీషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. గురువారం సాయంత్రానికి పోలింగ్ బూత్‌ల వారీగా అధికారుల నియామకాన్ని పూర్తి చేయడంతో పాటు సంబంధిత అధికారులను ఆయా బూత్‌లకు చేర్చే విధంగా ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నగర పోలీస్ విభాగం గట్టి నిఘా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి వీలుగా అదనపు బలగాలను మోహరించింది. సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలతో నిఘా ఏర్పాటు చేసింది.  అవసరమైతే వాచ్‌టవర్లు, ద్రోణ్‌ల సహాయంతో నిఘా ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ మేఘరిక్ తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు