సీమాంధ్రకు తొలి సీఎం జగనే

10 May, 2014 01:26 IST|Sakshi

ఓటమిని జీర్ణించుకోలేక బాబు అస్యత ఆరోపణలు
 ఎన్‌జీఓ మాజీ రాష్ట్ర   అధ్యక్షులు గోపాల్‌రెడ్డి

 
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఎన్‌జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబునాయుడు ప్రతి సారి ఆ నెపాన్ని ఉద్యోగులపైన నెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

2004, 2009 ఎన్నికల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఈవీఎంలను ఇళ్లకు తీసుకుపోయి మరుసటి రోజు స్ట్రాంగ్‌రూంలో అప్పజెప్పారని ఆరోపించి అభాసుపాలయ్యారన్నారు. ఈ సారి ఏకంగా గవర్నర్, ఎన్నికల కమిషన్‌లపైనే ఆరోపణలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నకిలీ కరెన్సీ, కల్తీ మద్యం అరికట్టడంలో రాష్ట్ర గవర్నర్ విఫలమయ్యాడని విమర్శించడం సిగ్గు చేటన్నారు.

ఎక్కడైనా నకిలీ కరెన్సీ, కల్తీ మద్యం పంపిణీ చేసినట్లు ఫిర్యాదులు వస్తే పోలీస్, ఎక్సైజ్ అధికారులు ప్రకటించాలి కానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఓటమి భయంతో పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు శతవిధాల ప్రయత్నించిన ఆయన గ్రామాల్లో గొడవలు సృష్టించాడని ఆరోపించారు.

అయినా ఎక్కడా రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర గవర్నర్, ఎన్నికల కమిషన్ విజయం సాధించాయని హర్షం వ్యక్తం చేశారు.సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి 120 నుంచి 135  సీట్లు వస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు కొర్రపాడు హుసేన్‌పీరా, ఎన్‌జీఓ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు