గుండెపోటా..వేధింపులా?

19 Feb, 2016 03:00 IST|Sakshi
గుండెపోటా..వేధింపులా?

చెన్నై, సాక్షి ప్రతినిధి: అవినీతి నిరోధక శాఖ (చెన్నై) అదనపు ఎస్పీ హరీష్ (33) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గుండెపోటు కారణమని పోలీసు లు చెబుతుండగా, ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని మరో ప్రచారం జరుగుతోంది. చెన్నై ఏసీబీ విభాగంలో ఎన్ హరీష్ అదనపు ఎస్పీ గా రెండు నెలల క్రితమే చేరారు. అవివాహితుడు కావడంతో చెన్నై ఎగ్మూరులోని పోలీసు అధికారు లు క్వార్టర్స్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం ఉద యం ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ఆయన కారు డ్రైవర్ ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన క్వార్టర్స్ సిబ్బంది ఎగ్మూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిచూడగా మంచంపై హరీష్ శవంగా పడి ఉన్నాడు.
 
  పోలీసు అదనపు కమిషనర్ శంకర్, సహాయ కమిషనర్ పెరుమాళ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న సమాచారం వేగంగా ప్రచారం కావడంతో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు క్వార్టర్స్ సముదాయం వద్దకు చేరుకోగా రెండుగేట్లు మూసివేసి అడ్డుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడిలో శిక్షణ పూర్తిచేసుకుని అదనపు ఎస్పీగా విధుల్లో చేరారు. మదురై జిల్లాలో కొంతకాలం పనిచేసి ప్రస్తుతం చెన్నై ఏసీబీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్‌లో ఉత్తీర్ణులైన వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన భాషలోఉత్తీర్ణత పొందాలని చెబుతున్నారు. అయితే హరీష్  తమిళ భాష పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని తెలుస్తోంది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే హరీష్ ఉన్నతాధికారుల వద్ద దాసోహం అన్నట్లు వ్యవహరించలేదని అంటున్నారు.
 
  దీనిని మనసులో పెట్టుకుని గతంలో డీజీపీ రామానుజం హరీష్‌పై విచారణకు ఆదేశించారు. ఈ విచారణ సంఘటన తరువాత పోలీస్‌శాఖలోని ఉన్నతాధికారులంతా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హరీష్‌పై విచారణ సాగుతున్నందున పదోన్నతిని కోల్పోయారు. అతనితోపాటు పనిచేసిన ఐపీఎస్ అధికారులు 2013లోనే ఎస్పీలుగా పదోన్నతిని పొందారు. హరీష్ తరువాత బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సైతం పదోన్నతిని అందుకున్నారు. దీంతో తనకంటే జూనియర్ల వద్ద హరీష్ పనిచేయాల్సి వచ్చింది.
 
  శాంతి భద్రతల విభాగంలో ఉంటే తన కంటే జూనియర్ల వద్ద విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్న బాధతోనే ఏసీబీకి మార్చమని ప్రస్తుత డీజీపీ అశోక్‌కుమార్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు వేధింపులు కొనసాగడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరీష్ ఇంటిలో ఉత్తరం దొరికిందని తెలుస్తోంది. అయితే పోలీసులు ఉత్తరం విషయాన్ని ధ్రువీకరించడం లేదు. హరీష్‌ది ఆత్మహత్య కాదు, గుండెపోటుకు గురై మరణించాడని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల వేధింపుల కారణంతో  తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఈ దశలో ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్‌శాఖను కలవరపెడుతోంది.
 

మరిన్ని వార్తలు