చిన్నమ్మ కోసం..

18 Dec, 2016 03:37 IST|Sakshi

► శశికళ కోసం వడివడిగా అడుగులు
►ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం
►శశికళను కలిసిన నటి విజయశాంతి


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిలో చిన్నమ్మ శశికళను కూర్చోబెట్టేందుకు పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు చేయిస్తూ ఏకగ్రీవంగా ఎంపికకు సిద్ధ్దమవుతోంది. శశికళను నటి విజయశాంతి కలుసుకోవడం శనివారం హైలెట్‌గా నిలిచింది. దర్శకుడు భారతీరాజా పోయెస్‌గార్డెన్‌లో శనివారం శశికళతో భేటీ అయ్యారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే  అధినేత్రి జయలలిత మరణం పార్టీని తాత్కాలికంగా కలవరపాటుకు గురిచేసినా, వెంటనే కోలుకున్న శ్రేణులు శశికళకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యాయి. అమ్మ స్థానంలో శశికళను ఎంపిక చేయడంలో ఆమెకు ఉన్న అర్హత ఏమిటని కొందరు నిలదీస్తున్నా ఎవరికి వారు ఆమె పట్ల భక్తి చాటుకుంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం 135 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశం వివరాలను గోప్యంగా ఉంచి శనివారం బహిర్గతం చేశారు. శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించినట్లు సీఎం తెలిపారు. శనివారం ఉదయం 11.45 గంటలకు సీఎం పన్నీర్‌సెల్వం తన మంత్రి వర్గ సహచరులు, తేనీ జిల్లా పార్టీ నేతలతో కలిసి జయ సమాధి వద్దకు చేరుకున్నారు.

ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని సమాధి వద్ద తీర్మానించారు. అక్కడి నుండి నాలుగు బస్సుల్లో పోయస్‌గార్డెన్ కు వెళ్లి తీర్మానం ప్రతిని శశికళకు అందజేశారు. తేనీ నేతలను పన్నీర్‌ సెల్వం తన నివాసానికి తీసుకెళ్లి విందుఇచ్చారు. అలాగే అన్నాడీఎంకే సాహిత్య విభాగం కార్యదర్శి, మాజీ మంత్రి వలర్మతి సైతం శశికళకు మద్దతుగా తీర్మానం చేశారు. మధురై నగర పార్టీ నేతలు శశికళకు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. పార్టీ జిల్లాల కార్యదర్శులు, నిర్వాహకులు శశికళను కలుసుకుని బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరారు. అలాగే పార్టీ మత్స్యకారుల విభాగం సైతం శనివారం సమావేశమై శశికళకు మద్దతు ప్రకటించింది.

విజయశాంతి రాక:
నటి విజయశాంతి శనివారం ఉదయం పోయస్‌గార్డన్ కు వెళ్లి శశికళను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా, దాదాపుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న విజయశాంతి అకస్మాత్తుగా చెన్నైలో ప్రత్యక్షం కావడం విశేషం. శశికళను కలుసుకున్న తరువాత జయ సమాధివద్దకు వెళ్లి నివాళులర్పించారు. అలాగే ప్రముఖ దర్శకులు భారతిరాజా కూడా శశికళను కలుసుకున్నారు.

>
మరిన్ని వార్తలు