ఆప్ గూటికి షెత్కారీ సంఘటన నేత పాటిల్

22 Jan, 2014 00:07 IST|Sakshi

ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని పటిష్టపరిచే దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. ఆప్ నాయకులు మయాంక్ గాంధీ, అంజలి దమానియా సమక్షంలో తన అనుచరులతో కలిసి షెత్కారీ సంఘటన నాయకుడు రఘునాథన్ పాటిల్ మంగళవారం ఆ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు నుంచి తాము ఆప్ సభ్యులమని, రేపటి నుంచి తమ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు.
 
 వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2003లో వచ్చిన ఈ చట్టం ఇప్పటివరకు సమర్థంగా అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. షెత్కారీ సంఘటన మహారాష్ట్ర విభాగం ఉనికిలోనే ఉంటుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యల కోసం గతంలో కాషాయకూటమికి తాము ఎన్నోసార్లు మద్దతిచ్చామని, అయితే ఆ సమస్యలను పరిష్కరించడంలో వాళ్లు పోరాటంలో చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రధాన ప్రతిపక్షమైన కాషాయకూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా సంఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో రైతు సమస్యల ప్రధాన ఎజెండాగా ప్రచారం ఉంటుందని, అందుకే ప్రజా ఉద్యమాల్లో నుంచి వచ్చిన ఆప్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. స్వాభిమాన్ షెత్కారీ సంఘటన్ ఎంపీ రాజు శెట్టి ఇటీవల కాషాయకూటమిలో చేరడంతో పాటిల్ ఆప్ తీర్థాన్ని పుచ్చుకోవడం గమనార్హం.
 
 అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు హెల్ప్‌లైన్
 లంచగొండి అధికారుల ఆగడాలను అరికట్టేందుకు నాసిక్ ఆప్ విభాగం హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. లంచాలు ఇవ్వలేక తీవ్ర నిరాశలో ఉన్న నగరవాసులకు 60 మంది సభ్యులు గల బృందం సహకరిస్తుందని ప్రకటించింది. ఈ బృందంలో న్యాయవాదులు, ఆర్‌టీఐ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఉంటారు. రేషన్ కార్డు జారీ చేసే విషయంలో, మరో ఇతర పనికోసమైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే అందుబాటులోకి రానున్న తమ హెల్ప్‌లైన్ 9823026131,  9823209131 నంబర్లలలో సంప్రదించాలని ఆప్ కన్వీనర్ జితేంద్ర భవే తెలిపారు. ఈ కాల్‌ను మాట్లాడిన వ్యక్తులు సదరు బృందాన్ని అప్రమత్తం చేసి బాధితులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఆప్‌లో 30వేల మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. 15వేల మంది ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నారని వివరించారు.
 

మరిన్ని వార్తలు