శివసేనకు కోర్టు నోటీసులు

16 Oct, 2013 23:15 IST|Sakshi
 సాక్షి, ముంబై: దసరా రోజున శివాజీపార్క్ మైదానంలో శివసేన నిర్వహించిన ర్యాలీలో నియమాల ఉల్లంఘన జరిగిందంటూ స్థానిక పోలీసులు నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీచేశారు. నాయకుల ప్రసంగంలో కోర్టు నిర్దేశించిన డెసిబుల్ కంటే లౌడ్‌స్పీకర్లలో ఎక్కువ సౌండ్ వినియోగించారని, దీంతో నియమాల ఉల్లంఘన జరిగిందని శివాజీపార్క్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. శివాజీపార్క్ మైదానం పరిసరాలు సెలైంట్ జోన్ పరిధిలోకి రావడంతో కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఎలాంటి సభలు, రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతివ్వడం లేదు. కాగా నాలుగు దశాబ్దాలకుపైగా దసరా రోజున శివసేన ఇక్కడే ర్యాలీ నిర్వహిస్తూ వస్తోం దని, ఈ సారి కూడా అనుమతివ్వాలని బీఎంసీకి నిర్వాహకులు దరఖాస్తు పెట్టుకున్నారు. కాగా ఈ ఏడాది పార్టీ నిర్వహిస్తున్న సభ శివసేన అధినేత బాల్ ఠాక్రే లేకుండా జరగడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
 
 సదరు దరఖాస్తును బీఎంసీ తిరస్కరించడంతో పార్టీ నాయకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బాల్ ఠాక్రే లేకుండా మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి అనుమతి లభిస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విచారణ జరిపిన న్యాయమూర్తులు కొన్ని షరతులపై అనుమతి ఇచ్చారు. ధ్వని కాలుష్యాన్ని (డెసిబుల్ సౌండ్) నియంత్రణలో ఉంచాలంటూ షరతు విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వనిపై విధించిన నియమాలను ఉల్లంఘించబోమని కోర్టు రాతపూర్వకంగా నిర్వాహకుల నుంచి కోర్టు హామీ తీసుకుంది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. మైక్ టెస్టింగ్ సమయంలో 55 డెసిబుల్ ఉన్న సౌండ్ సభ ప్రారంభం కాగానే వేదికపై కొందరు నాయకులు ప్రసంగించినప్పుడు 59 డెసిబుల్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ 103.4 డెసిబుల్‌కు చేరుకుంది.
 
 కాగా దసరా ర్యాలీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, బాణసంచా పేల్చడం వల్ల ధ్వని కాలుష్యం పెరిగిందని శివసేన నాయకుడొకరు తెలిపారు.  దీనిపై ‘ఆవాజ్ ఫౌండేషన్’ తాను రూపొందించిన నివే దికను సీఎంకు పంపించింది. కాగా ఈ షోకాజ్ నోటీసుపై వెంటనే వివరణ ఇవ్వాలని కోర్టు నిర్వాహకులను ఆదేశించింది. 
మరిన్ని వార్తలు