సెమిస్టర్ పద్ధతి రద్దు చేయండి

17 Jan, 2014 03:41 IST|Sakshi

 బళ్లారి అర్బన్, న్యూస్‌లై న్ :  ఐటీఐ విద్యార్థులకు ఇబ్బందికరమైన సెమిస్టర్ పద్ధతిని రద్దు చేయకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ హెచ్చరించారు. ఆయన గురువారం ఏఐడీవైఓ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యత ఉందని, అయితే ప్రభుత్వం సెమిస్టర్ పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా అవుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఐటీఐ కోర్సులలో ఈ సెమిస్టర్ పద్ధతిని అమలుతో గందరగోళం నెలకొందన్నారు. సెమిస్టర్ పద్ధతిలో విద్యార్థులకు బోధించడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, గత నవంబర్ నెలలో పాఠ్యాంశాలు (సిలబస్) మార్పు చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందన్నారు.

గతంలో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేందుకు అనుకూలంగా ఉండేదని, అయితే ఈ సెమిస్టర్ పద్ధతి అమలు చేయడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. 2011లో ఎన్‌సీబీటీ 39వ సమావేశంలో సెమిస్టర్ పద్ధతిని అమలు పరిచేందుకు పాఠ్యంశాల బోధన, పరీక్ష విధానాలు, ప్రయోగశాలలో పరికరాలు సమకూర్చడం వాటిపై సరైన సమాచారం లేకపోవటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 2013 మార్చి 14న నిపుణులు నిర్వహించిన  సమావేశంలో తక్కువ వ్యవధిలో పాఠాల బోధనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

 గత ఏడాది ప్రశ్నపత్రం కన్నడలో ముద్రించారు. ఈ ఏడాది ఇంగ్లిష్, హిందీలో తయారు చేయడం వల్ల విద్యార్థులు మరింత ఆందోళన కు గురవుతున్నట్లు చెప్పారు.  ఈ ఆందోళనలో ఏఐడీవైఓ జిల్లా ఉపాధ్యక్షుడు రంగయ్య, ఏఐడీఎస్‌ఓ జిల్లాధ్యక్షుడు గోవింద, జిల్లా కార్యదర్శి ఉమేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు