వాంగ్మూలం చూపండి

15 Apr, 2014 23:02 IST|Sakshi
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో అపరాధులకు విధించిన ఉరిశిక్షపై స్టేను కొనసాగిస్తున్నట్టు ప్రకటించిన సుప్రీంకోర్టు, ఆమె మరణవాంగ్మూలాన్ని సమర్పించాలని నగర పోలీసులను మంగళవారం ఆదేశించింది. ఈ కేసు నలుగురు దోషుల్లో ఇద్దరు ముకేశ్, పవన్ గుప్తాకు ఉరిశిక్ష వేయడంపై అత్యున్నత న్యాయస్థానం గతంలోనే స్టే మంజూరు చేయడం తెలిసిందే. నిర్భయ వాంగ్మూలం ప్రతి తన వద్ద లేదని దోషుల తరఫు న్యాయవాది తెలపడంతో, దానిని సమర్పించాలని న్యాయమూర్తులు బీఎస్ చౌహాన్, చలమేశ్వర్‌తో కూడిన బెంచ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ సిద్ధార్థ్ లూథ్రాను ఆదేశించింది. ‘మరణ వాంగ్మూలం సక్రమంగా ఉంటే, ఈ కేసులో మేం జోక్యం చేసుకోవాల్సిన అవసరమే ఉండదు’ అని జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు.
 
 పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ముకేశ్, పవన్‌తోపాటు వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్, రామ్‌సింగ్, మైనర్ 2012 డిసెంబర్ 16న అత్యాచారం చేసినట్టు కేసు నమోదయింది. కదులుతున్న బస్సులో వీళ్లంతా ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 29న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో మైనర్‌కు బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించగా, ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగతా నలుగురికి దిగువకోర్టు ఉరిశిక్ష విధించగా, హైకోర్టు కూడా ధ్రువీకరించింది. అయితే ముకేశ్, పవన్‌కు ఉరిశిక్ష విధింపుపై ప్రత్యేక విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంజనాప్రకాశ్ దేశాయ్, శివకీర్తి సింగ్ మార్చి 15 వరకు శిక్ష అమలుపై స్టే విధించారు. 
 
 తదనంతరం ఈ కేసు చౌహాన్ బెంచ్‌కు బదిలీ కాగా, ఇది ఈ నెల ఏడు వరకు స్టేను పొడిగించింది. దిగువకోర్టు తీర్పును పరిశీలించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. నిర్భయ పోస్టుమార్టం నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ స్టే మరోసారి పొడిగించింది. నిర్భయ పేగులకు తీవ్ర గాయాలు కావడం వల్లే రక్తస్రావం జరిగిందని పోస్టుమార్టం నివేదిక ధ్రువీకరించలేదని ముకేశ్, పవన్ వాదించారు. రాజకీయ ఒత్తిడి కారణంగా దిగువకోర్టు ఈ కేసులో నిష్పాక్షిక విచారణ నిర్వహించలేదని ఆరోపించారు. 
 
మరిన్ని వార్తలు