అందులో నా దర్శకులు ఫెయిల్

14 Dec, 2014 08:54 IST|Sakshi
అందులో నా దర్శకులు ఫెయిల్

 నాలోని నటిని ఉపయోగించుకోవడంలో దర్శకులు విఫలం అయ్యారంటున్నారు నటి శ్రేయారెడ్డి. టీవీ వ్యాఖ్యాత నుంచి వెండితెర హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ భామ. తొలుత తెలుగులో నటించిన తరువాత తిమిరు చిత్రంలో తమిళంలో తన పొగరైన నటనను ప్రదర్శించి కోలీవుడ్ చూపును తన వైపు తిప్పుకున్నారు. ఆ చిత్ర సమయంలోనే నిర్మాత విక్రమ్‌కృష్ణతో పరిచయం, ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అంతేకాదు అంతటితో నటనకు దూర మైన శ్రేయారెడ్డి సుమారు ఐదేళ్ల తరువాత నటిగా రీఎంట్రీ అవుతున్నారు. అండావై కానోం చిత్రం ద్వారా బలమైన పాత్రలో మనముందుకు రానున్నారు. ఈ సందర్భంగా శ్రేయారెడ్డి చెప్పిన సంగతులు ఏంటో చూద్దాం.
 
 పెళ్లయిన తరువాత కనిపించకుండా పోయారే?
 నిజం చెప్పాలంటే నేను ఇష్టపడి నటించేలా పాత్రలు లభించలేదు. నా నటనను సినీ అభిమానులతోపాటు విమర్శకులు ప్రశంసించారు. అలాంటిది దర్శకులు మాత్రం నాలోని నటిని సరిగా ఉపయోగించుకోవడంలో ఫెరుుల్ అయ్యూరు. అప్పట్లో మంచి కథా పాత్రలకు కొరత ఉండేది. అయితే ప్రస్తుతం చాలా మార్పు కనిపిస్తోంది. నేను నటించి ఐదేళ్లు అయినా అండావై కానోం చిత్రంలో మీరు నటిస్తేనే కరెక్ట్‌గా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు వేల్ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే అనేశాను.
 
మీకంతగా నచ్చిన ఆ కథ గురించి?
నేను నటించడానికి మంచి స్కోప్ ఉన్న కథా చిత్రం. తేని సమీపంలోని ఒక గ్రామంలో నివసించే శాంతి అనే యువతిగా నటిస్తున్నాను. ఎంతో ప్రాణంగా భావించే వెలకట్టలేని ఒక వస్తువును కోల్పోయినప్పుడు ఆమెలో కలిగే భావోద్రేకాలే చిత్ర ఇతి వృత్తం. చివరికి ఆమె పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందగలిగిందా? లేదా? అన్నదే అండావై కానోం చిత్రం. ఇంకా చెప్పాలంటే ఇది బ్లాక్ కామెడీ చిత్రం అని చెప్పవచ్చు.
 
 ఇప్పటికీ ఫిట్‌నెస్ బాడీని మెయిన్‌టైన్ చేస్తున్నారు ఎందుకో?
 యాక్షన్ చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మీరన్నట్లుగానే నా ఫిట్‌నెస్ బాడీని చూసి మలయాళంలో భరత్ చంద్రన్ ఐపీఎస్ అనే చిత్రంలో పోలీసు అధికారిణిగా నటించమని అడిగారు. అయితే ఆ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు లేకుండా చేశారు. కిల్ బిల్ లాంటి యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలని ఉంది. నా తండ్రి భరత్‌రెడ్డి క్రికెట్ క్రీడాకారుడు. అందువలన ఐదేళ్ల వయసు నుంచే పిట్‌నెస్ అనేది నా బాడీలో ఒక అంగంగా మారిపోయింది.  
 
ఈ చిత్రంలో ప్రత్యేకతలేంటి?
అండావై కానోం చిత్రంలో నా కొక ఫైట్ సన్నివేశం ఉంది. అది చాలా సహజత్వంతో కూడిన ఫైట్. ఆ ఫైట్ కోసం 50 అడుగుల ఎత్తు నుంచి నిజంగానే దూకేసి ఫైట్ చేశాను. ఎలాంటి ట్రిక్స్‌ను నమ్ముకోకుండా ఒరిజినల్‌గా నటించాను.
 

>
మరిన్ని వార్తలు