ప్రధాని మోదీ ఓ నియంత : సీఎం

4 Oct, 2016 06:25 IST|Sakshi
ప్రధాని మోదీ ఓ నియంత : సీఎం

గ్రామ స్వరాజ్య కార్యక్రమంలో సీఎం సిద్ధు ఆగ్రహం
అభివృద్ధికి సహకరించలేదని ఆరోపణ


బెంగళూరు: పాలన పరంగా ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఆదివారం విదురాశ్వత్థంలో జరిగిన గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... గల్లి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సముచిత పాలన అందించాల్సిన ప్రధాని మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తెచ్చినప్పటి నుంచి రైతులు, ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం ఫసల్‌ భీమా పథకానికి రూ.666 కోట్లు రిజర్వు చేశామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, రైతులు, ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు బీజేపీ నాయకులు అడ్డుపడుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. కావేరి నదీ జలాల పంపిణీలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులు రాష్ట్రానికి,ప్రజలకు శరాఘాతాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, కె.హెచ్‌.మునియప్ప. మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కేపీసీసీ కార్యదర్శి దినేశ్‌ గుండూరావ్, డిప్యూటీ స్పీకర్‌ శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు