మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ సీఎం

28 Jan, 2019 16:46 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న సిద్ద రామయ్య తన సమస్యలు చెప్పుకుంటున్న మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ద రామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాగేయగా.. చున్నీ కూడా జారిపోయింది. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య తన కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ద రామయ్య ఎదుట ఓ మహిళ సమస్యలను ఏకరువు పెట్టింది. పదే పదే ఓ విషయంపై ప్రశ్నిస్తున్న ఆమెపై సిద్ద రామయ్య తెగ చిరాకుపడ్డారు. 

ఆ సమయంలో సహనాన్ని కోల్పోయిన సిద్ద రామయ్య ఆమె లేచిన ప్రతిసారి కూర్చో, కూర్చో అంటూ కసురుకున్నారు. అయినా ఆ మహిళ ఏదో చెబుతుండగా.. ఆమె మైక్‌ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చున్నీ కూడా జారీపోయింది. నిండు సభలో ఈ ఘటన జరిగిన కూడా సిద్ద రామయ్య శాంతించలేదు. ఆ తర్వాత కూడా మహిళపై ఆగ్రహంతో ఊగిపోయారు. సిద్దరామయ్య ఓ మహిళతో ఇలా ప్రవర్తించడాన్ని చూసిన అక్కడున్న అధికారులు, ప్రజానీకంతోపాటు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా నివ్వెరపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సిద్ద రామయ్య ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా సిద్ద రామయ్య పలు వివాదాలకు కేంద్రంగా నిలిచారు.


మైక్‌ లాక్కునే క్రమంలోనే అనుకోకుండా జరిగింది: దినేశ్‌ గుండురావు
ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండురావు.. కొన్ని సందర్భాల్లో ప్రజలు చాలా కఠినంగా ప్రశ్నలు అడుగుతారని.. వాటిని నేతలు విన్నప్పటికీ.. వారు మళ్లీ అదే అడుగుతూ ఉంటారని.. ఆ సమయంలో మైక్‌ లాక్కోవాల్సి వస్తుందని చెప్పారు. సిద్ద రామయ్య మహిళ చేతిలో నుంచి మైకును లాక్కునే క్రమంలో అనుకోకుండా ఆమె దుప్పట్ట జారీపోయిందని.. ఇది కావాలని చేసింది కాదని అన్నారు. 

రాహుల్‌ ఏం సమాధానం చెప్తారు: ప్రకాశ్‌ జవడేకర్‌
సిద్ద రామయ్య మహిళతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మహిళతో సిద్ద రామయ్య ప్రవర్తన చూస్తుంటే.. వారు మహిళలను ఏ రకంగా గౌరవిస్తారో తెలుస్తుందన్నారు. ఇది తీవ్రమైన నేరం అని తెలిపారు. వారు ఒక కుటుంబానికి చెందిన మహిళలను మాత్రమే గౌరవిస్తారని జవడేకర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు