ప్రచార పర్వంలోకి సిద్ధు

14 Aug, 2015 02:34 IST|Sakshi

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల ప్రచార పర్వంలోకి  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం లాంఛనంగా అడుగుపెట్టేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం కోసం రూపొందించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను  కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి కార్పొరేటర్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో గురువారం ఉదయం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల వారీగా అభ్యర్థులు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజలకు ఎలా వివరించాలి వంటి అంశాలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. అంతేకాక బీజేపీ హయాంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, నగరంలో తలెత్తిన చెత్త సమస్య వంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు.

అనంతరం గురువారం మద్యాహ్నం నగరంలోని బీటీఎం లే అవుట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పూర్తై తర్వాత  నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధరామయ్య తొలుత భావించారు. అయితే ఇప్పటికే బీజేపీ, జేడీఎస్‌లు ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఇంకా ఆలస్యం అయితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి గురువారం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈనెల 15 తర్వాత స్టార్ ప్రచారకులతో బీబీఎంపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నుంచే నగరంలో ప్రచారాన్ని చేపట్టనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించని కారణంగా దాదాపు 100 మంది రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెబల్ అభ్యర్థులతో పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరపడంతో వీరిలో దాదాపు 60 మంది గురువారం రోజున తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాగా మిగిలిన వారికి జేడీఎస్ పార్టీ తక్షణమే బీ-ఫాంలు అందించడంతో ప్రస్తుతం వీరంతా జేడీఎస్ తరఫున పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెబల్స్ బెడదను తప్పించుకొని, విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులే చేయాల్సి వస్తోందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా