గౌరవప్రదమైన నిష్ర్కమణ కోసం...నేడు సీఎస్‌కేతో ఆర్‌సీబీ ఢీ

24 May, 2014 02:40 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్లే ఆఫ్ ఆశలు మృగ్యమవడంతో టోర్నీ నుంచి గౌరవప్రదంగా నిష్ర్కమించడానికి రాయ్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఉబలాటపడుతోంది. ఇప్పటికే ‘సెమీస్’లో బెర్త్‌ను ఖరారు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓడినా పెద్దగా నష్టమేమీ లేదు కనుక ఆడుతూ పాడుతూ ఆర్‌సీబీని కవ్వించనుంది.

ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తలపడనున్నాయి. ఈ నెల 18న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గెలుపు వాకిట బోల్తా పడిన సీఎస్‌కే ధోనీ సేన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులు తేడాతో ఓటమి పాలైన ఆర్‌సీబీ మూటా ముల్లె సర్దుకుంది.

టైటిల్‌ను చేజిక్కించుకోవాలనే సంకల్పంతో యువరాజ్ సింగ్‌ను రూ.14 కోట్లకు వేలం పాడుకున్న ఆర్‌సీబీ యజమాని విజయ్ మాల్యకు ఈ టోర్నీ తీవ్ర నిరాశనే మిగిల్చింది. గత ఐపీఎల్‌లో 600 పరుగులు చేయడమే కాకుండా ఎలాంటి తప్పిదాలకు పాల్పడని ఆర్‌సీబీ స్కిప్పర్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్‌కేపై కన్సొలేషన్ గెలుపు ద్వారా పరువు దక్కించుకోవాలని అతను ఉబలాటపడుతున్నాడు.

అయితే సీఎస్‌కే ఫామ్‌ను పరిశీలిస్తే, కోహ్లీ అనుకున్నట్లుగా ఈ మ్యాచ్ సాగడం కష్టం. కీలకమైన బ్యాట్స్‌మెన్ అత్యవసర సమయాల్లో విఫలమైన తీరును చూస్తే... ఆర్‌సీబీ బ్యాటింగ్ ఆర్డర్  పేపర్ టైగర్లనే హాస్యోక్తిని గుర్తు చేస్తోంది.

విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, అప్పుడప్పుడు మెరుపులు మెరిపించే పార్థివ్ పటేల్‌లు పేలమైన ఆట తీరును కనబరిచారు. దరిమిలా యువరాజ్‌పై విపరీతంగా ఆధార పడాల్సి వచ్చింది. వారాంతంతో పాటు ఆఖరి లీగ్ మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి రానున్నారు. టికెట్లన్నీ దాదాపుగా అమ్ముడు పోయాయి.

మరిన్ని వార్తలు