రాజకీయాలకు 'గులామ్' అలీ..

7 Oct, 2015 20:55 IST|Sakshi
రాజకీయాలకు 'గులామ్' ..

- పాకిస్థానీ గాయకుడు గులామ్ అలీ.. భారత్ లో పాడటానికి వీలులేదంటూ శివసేన ఆందోళనలు
- ముంబైలో ఎల్లుండి జరగాల్సిన గజల్ కచేరీ రద్దు

 ముంబై:
సంగీత సాహిత్యాలకు కులం, మతం, ప్రాంతం, భాషా బేధాలు లేవంటారు. కానీ అది నిజం కాదని, పశ్చిమ సరిహద్దును దాటి వచ్చే సంగీతాన్ని భారతీయులు వినకూడదని అంటున్నారు శివసేన పార్టీ నేతలు, కార్యకర్తలు.

కళలు, క్రీడలపై తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిచజూసే శివసేన పార్టీ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకుడు, పాకిస్థానీ అయిన ఉస్తాద్ గులామ్ అలీ.. ముంబైలో శుక్రవారం నిర్వహించనున్న సంగీతకచేరీని రద్దుచేయాలంటూ  తీవ్రస్థాయిలో  ఆందోళనలు నిర్వహించారు.


'ఓవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం భారతీయులను కాల్చిచంపుతుంటే.. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి?' అంటూ నినాదాలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ' పాకిస్థాన్ తో క్రీడలైనా, సాంస్కృతి అంశమైనా, దౌత్యపరమైన చర్చలైనా  ప్రతిదానినీ మేం వ్యతిరేకిస్తం. ఆ దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు మా వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదు' అన్నారు.

ఈ మేరకు కచేరీ జరగనున్న షణ్ముఖానంద్ హాల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. శుక్రవారం సాయంత్రం గులామ్ అలీ కచేరి ప్రారంభం కావాల్సిఉంది. కాగా శివసేన ప్రకటనలతో అప్రమత్తమైన ఫడ్నవిస్ సర్కార్.. గులామ్ అలీ కచేరీ కి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తానని ప్రకటించింది. కానీ.. చివరి నిమిషంలో కచేరీ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సంగీత కార్యక్రమం సజావుగా సాగదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు