ఆర్థిక దోపిడీ నుంచి దేశాన్ని కాపాడాలి : సీతారం ఏచూరి

4 Dec, 2018 12:58 IST|Sakshi
మాట్లాడుతున్న సీతారాం ఏచూరి

సీపీఎం జాతీయ కార్యదర్శి 

సాక్షి, బోనకల్‌: సామాజిక దౌర్జన్యం, ఆర్థిక దోపిడీ నుంచి దేశాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వెనుకబాటు తనానికి కారణం పాలకుల ఏలుబడేనన్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ప్రజా ఉద్యమాల ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. దేశంలో ఆర్థిక దోపిడీ, ధరల పెరుగుదల, రైతు ఆత్మహత్యలు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి కాంగ్రెస్, బీజేపీ విధానాలే కారణమన్నారు. పెట్టుబడిదారులు బ్యాంకుల నుండి రూ.12లక్షల కోట్లను అప్పుగా తీసుకొని... విదేశాలకు వెళ్లడం వెనుక ప్రధాని ప్రోత్సాహం ఉందన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని విమర్శించారు. దళితులు, ముస్లింలు, గిరిజనులపై దౌర్జన్యాలు నానాటికి పెరిగి పోతున్నాయన్నారు. మోదీ సర్కారు కనుసన్నల్లో టీఆర్‌ఎస్‌ నడుస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాలు విప్లవకారులకు వేదికగా ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. విప్లవ కారులకు తెలంగాణ రాష్ట్రం తీర్థయాత్ర లాంటిదన్నారు. దేశంలో మోదీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌లను గద్దె దించాలన్నారు. దేశంలో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 371(డీ) ఆర్టికల్‌ పాలకుల నిర్లక్ష్యం వలన వెనుకబాటుతనానికి కారణమైందన్నారు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి కోట రాంబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు, నాయకులు దొండపాటి నాగేశ్వరావు, మాదినేని లక్ష్మీ, బండి పద్మ, కోట రాంబాబు, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు