ప్రఖ్యాత నటుడి విగ్రహం తొలగింపు

4 Aug, 2017 08:59 IST|Sakshi
ప్రఖ్యాత నటుడి విగ్రహం తొలగింపు

సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో ఉన్న ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్‌ నిలువెత్తు విగ్రహాన్ని చడీ చప్పుడు కాకుండా, రాత్రికి రాత్రే అధికారులు తొలగించడం వివాదానికి దారి తీసింది. అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ వినీలాకాశంలో నడిగర్‌ తిలగం, నట ఖ్యాతిని చాటిన శివాజీ గణేశన్‌ గౌరవాన్ని చాటేలా 2006లో చెన్నై మెరీనా తీరంలో డీఎంకే ప్రభుత్వం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కామరాజర్‌ రోడ్డు, రాధాకృష్ణన్‌ రోడ్డు కూడలిలో ఎనిమిది అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం గంభీరంగా దర్శనం ఇస్తుంటుంది.

ఈ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా గాంధేయ వాది శ్రీనివాసన్‌ 2011లో కోర్టును ఆశ్రయించారు. ఈ విగ్రహం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. విగ్రహం తొలగింపుకు కోర్టు తీర్పు ఇవ్వడంతో అభిమానుల్లో ఆవేదన బయలుదేరింది. అయితే, అడయార్‌లో శివాజీ గణేశన్‌కు స్మారక మండపం నిర్మిస్తున్నామని, అంతవరకు విగ్రహం తొలగించబోమని దివంగత సీఎం జయలలిత ప్రకటించారు. ప్రస్తుతం ఆ మండపం పనులు ముగింపు దశకు చేరడంతో బుధవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చడీ చప్పుడు కాకుండా విగ్రహాన్ని అధికారులు తరలించారు. గురువారం ఉదయం చూసేసరికి విగ్రహం లేకపోవడంతో  అభిమానులు అవాక్కయ్యారు. తమ అభిమాన నటుడి విగ్రహం తొలగించిన ప్రదేశంలో పాలాభిషేకం చేశారు.

కాగా, మెరీనా తీరంలో రోడ్డు పక్కగా మరో విగ్రహం ఏర్పాటుకు చట్టపరంగా అభిమానులతో కలిసిముందుకు సాగుతామని శివాజీ గణేశన్‌ తనయులు, నటులు ప్రభు, రామ్‌కుమార్‌ తెలిపారు. కాగా, ఉన్నపళంగా అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించడాన్ని తమిళ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

మరిన్ని వార్తలు