ఆరుగురు అన్నదాతల ఆత్మహత్య

7 Aug, 2015 02:03 IST|Sakshi

బెంగళూరు(బనశంకరి) : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అప్పులు తీర్చే మార్గం కానరాక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...

మండ్య : మండ్య జిల్లా మద్దూరు తాలూకా మారసింగనహళ్లికి చెందిన రైతు పుట్టస్వామి(45), పంట పెట్టుబడుల కోసం బ్యాంకులో రూ.6 లక్షల మేర అప్పులు చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయాడు. ఈ దశలోనే అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో దిక్కుతోచక బుధవారం రాత్రి తన పొలంలో ఉరి వేసుకున్నాడు. కాగా, మండ్య జిల్లాలో ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 39కి చేరుకుంది.

బెళగావి : బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా జోడుకురుళి గ్రామానికి చెందిన రైతు లగమాకద్ద(46), తనకున్న నాలుగు ఎకరాల పొలంలో చెరుకు ఇతర పంటలు వేశాడు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పు చేశాడు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంట  ఎండిపోయింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలంటూ మదన పడుతున్న అతను గురువారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై చిక్కోడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యాదగిరి : యాదగిరి జిల్లా కందకూరు గ్రామానికి చెందిన రైతు తిమ్మణ్ణ కురబర(46), తనకున్న మూడుఎకరాలతో పాటు మరో  20 ఎకరాల భూమిని గుత్తకు తీసుకుని కందిపంట వేశాడు. పంట పెట్టుబడుల నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.10 లక్షలు, బ్యాంకులో రూ.70 వేలు దాకా అప్పులు చేశాడు. సకాలంలో వర్షం కురవకపోగా పంట ఎండిపోవడంతో అప్పులు తీర్చే దారిలేక బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకున్నాడు.

విజయపుర : విజయపుర జిల్లా ఇండి తాలూకా హలసంగి గ్రామానికి చెందిన రైతు పైగంబర్‌ముజావర్(40) తనకున్న మూడెకరాల పొలంలో పప్పుదినుసుల పంట వేశాడు. పంట సాగు కోసం యూనియన్ బ్యాంక్ నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు అప్పుచేశాడు. వర్షం రాకపోవడంతో పంటనాశనమైంది. అప్పులు తీర్చేదారిలేక గురువారం ఉదయం రైతు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 రామనగర : రామనగర జిల్లా కటుకనపాల్యకు చెందిన రైతు జయణ్ణ(55) తనకున్న వ్యవసాయపొలంలో రేషం పంట వేయడానికి లక్షలాదిరూపాయలు అప్పు చేశాడు. పట్టుగూళ్ల ధర పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పు తీర్చేదారిలేక రైతు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు రామనగర జిల్లాలో 10 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రాయచూరు : రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా శవంతనగరకు చెందిన రైతు హనుమంత నరసన్న(40) తనకున్న ఎకరా పొలంలో పత్తిపంటవేశాడు. పంటపెట్టుబడుల నిమిత్తం రూ.1.20 లక్షలు అప్పుచేశాడు. వర్షం సకాలంలో పడకపోవడంతో పంట ఎండిపోయి నష్టపోయాడు. అప్పుతీర్చే దారిలేక గురువారం తెల్లవారుజామున రైతు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గబ్బూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు