కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

8 Sep, 2017 19:17 IST|Sakshi
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

►క్రూజర్‌ వాహనాన్ని ఢీకొన్న కేఎస్‌ఆర్టీసీ బస్సు
►మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దుర్మరణం


సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలిగొంది. కేఎస్‌ ఆర్టీసీ బస్సు... క్రూజర్‌ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా, దారపాళ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వివరాలు.. దారపాళ గ్రామానికి చెందిన 12 మంది వ్యక్తులు కేన్సర్‌ ఔషధం కోసం క్రూజర్‌ వాహనంలో గురువారం సాయంత్రం శివమొగ్గకు చేరుకున్నారు. అక్కడ ఔషధం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

బాగల్‌కోటే జిల్లా బీళగి తాలూకా, కూర్తి క్రాస్‌ వద్ద ఇవాళ ఉదయం విజయపుర నుంచి హుబ్లీ వెళ్తున్న కేఎస్‌ ఆర్‌టీసీ బస్సు క్రూజర్‌ను అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న నాగేశమాళే, పాండురంగసాళుంకె, విజయాసిందతో పాటు మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు క్రూజర్‌ వాహనం నుజ్జు నుజ్జు కావడంతో కొన్ని మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.

ప్రమాదం సమయంలో భారీ శబ్ధం రాగా ఏదో జరిగిందని భావించి చుట్టుపక్క గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురితోపాటు మృతదేహాలను బీళగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు