ఈ నీటితో రోగాలు ఖాయం

19 Dec, 2013 23:41 IST|Sakshi


 పది మందిలో నలుగురికి చర్మరోగాలు
     ఎయిమ్స్ పరిశోధనల్లో వెల్లడి
     {పత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పర్యావరణవేత్తల సూచన
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కలుషిత నీటి సరఫరా కారణంగా చలి కాలంలో చర్మరోగాల బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చలికాలంలో ఢిల్లీలో పదిలో నలుగురు చర్మరోగాల బారినపడుతున్నట్టు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. వీటిలో చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాగేనీటి విషయంలో తీసుకునే జాగ్రత్తలు స్నానం చేసే, ఇతర పనులకు వినియోగించే నీటి విషయంలో ఉండకపోవడమూ ఓ కారణం అవుతోంది. చలికాలంలో వాడుకునే నీటి విషయంలోనూ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని వైద్యులు పేర్కొంటున్నారు. ఢిల్లీ నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో సరఫరా అవుతున్న 12 ప్రముఖ జోన్లలో సేకరించిన నీటి నమూనాలను ఎయిమ్స్ డెర్మటాలజీ విభాగం డాక్టర్లు  ఇటీవల పరిశీలించారు. వీటిలో 70శాతం నీటిలో రసాయన పదార్థాలు ఉండాల్సిన మోతాదు కంటే చాలా ఎక్కువ ఉన్నట్టు తేలింది. లెడ్‌శాతం అధిక మోతాదులో ఉన్నట్టు అధికారులు గ్రహించారు. వీటి కారణంగా చర్మంపై ఫంగస్, దురదలు వ్యాప్తి చెందే అవకాశాలున్నట్టు వైద్యులు  తెలిపారు.
 
  వేసవి కాలంలో చెమట రూపంలో శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయని, చలి కాలంలో ఈ ప్రక్రియ మందగించడంతో సాధారణంగానే చర్మరోగాలు ఎక్కువగా వస్తుంటాయని గంగారాం ఆసుపత్రి డాక్టర్. రోహిత్ బత్రా తెలిపారు. చ లికాలంలో దుస్తులు తరచూ ఉతకకపోవడం కారణంగా వాటిలో ఫంగస్ వ్యాప్తి చెందుతుందన్నారు. ఎయిమ్స్ డెర్మటాలజీ విభాగం చేసిన పరిశోధనలు వెల్లడించిన ప్రకారం ఎక్కువ మంది ప్రజలు తాగేనీటి విషయంలో చూపుతున్న శ్రద్ధ, స్నానం చేసే, వాడుకునే నీటి విషయంలో పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న తాగునీరు, వాడుకునేందుకు సైతం పనికి రాని విధంగా ఉందని తేలింది. మెహ్రోలీ, తుగ్గకాబాద్ ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో అత్యధికంగా రసాయనాలు ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీలో భూగర్భ జలాలు రోజురోజుకు క లుషితం అవుతున్నట్టు పర్యావరణ శాస్త్రవేత్త అనుపమ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ సమస్యను సకాలంలో గుర్తించనట్లయితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకోసం రెయిన్ వాటర్ హార్‌వెస్టింగ్ సిస్టంను అమలులోకి తేవాలని సూచించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా ప్రారంభించలేదని తెలిపారు.
 

మరిన్ని వార్తలు