బండి పార్క్‌చేస్తే బాదుడే

16 Mar, 2019 13:21 IST|Sakshi

85 రహదారుల్లో స్మార్ట్‌ పార్కింగ్‌

గంటల లెక్కన రుసుం వసూలు

రూ.397 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పాలికే ప్రయత్నాలు

కర్ణాటక, బనశంకరి : హైటెక్‌ సిటీ బెంగళూరులో స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థ అమల్లోకి రానుంది. పాలికే తన ఆదాయ వనరులను పెంచుకునేందుకు వాహనాల పార్కింగ్‌దారులపై భారం మోపనుంది.  స్మార్ట్‌ పార్కింగ్‌ విధానం కింద వాహనదారులకు గంటల లెక్కన పార్కింగ్‌ రుసుం వసూలు చేయనుంది. ఇలా  పదేళ్లలో రూ.397 కోట్ల ఆదాయం ఆర్జించాలని  లక్ష్యంగా పెట్టుకుంది.  బెంగళూరుమహానగర పాలికెలో  పార్కింగ్‌ ఓ మాఫియాగా మారిపోయింది. దీనికి అడ్డుకట్ట వేయాలనే దృష్టితో స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థ అమలుకు బీబీఎంపీ  ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఈమేరకు టెండర్లు నిర్వహించి ఆమోదించింది. దీంతో నగరంలో త్వరలో 85 రోడ్లులో స్మార్ట్‌పార్కింగ్‌ విధానం అమల్లోకి రానుంది.

పదేళ్లులో రూ.397 కోట్లుఆదాయం లక్ష్యం
టెండర్‌ నిబంధనల మేరకు స్మార్ట్‌ పార్కింగ్‌ పొందిన కాంట్రాక్టర్‌  బీబీఎంపీ కి ఏడాదికి రూ.31.60 కోట్లు చెల్లిస్తారు.  రానున్న పదేళ్ల వరకు    ఏటా 5 శాతం మేర పెంచి పదేళ్లలో రూ.397.46 కోట్లు చెల్లిస్తారు.

13,600 వాహనాలకు పార్కింగ్‌
కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ స్మార్ట్‌ పార్కింగ్‌ను మూడునెలల్లో అమల్లోకి తీసుకువస్తుంది. బీబీఎంపీ గుర్తించిన 85 రహదారుల్లో 3,600 కార్లు, 10 వేల బైక్‌లకు పార్కింగ్‌కు అవకాశం కల్పిస్తారు.

పార్కింగ్‌ మీటర్లు ..
పార్కింగ్‌ చార్జీలు వసూలు, రసీదు అం దించేందుకు మీటర్లు అమరుస్తారు.  పార్కింగ్‌ స్థలంలోకి ప్రవేశించినప్పుడు పార్కింగ్‌ మీటర్లనుంచి రసీదు పొందాలి. తిరిగి బయలు దేరినప్పుడు రసీదులో బార్‌కోడ్‌ చూపిస్తే ఎంత చార్జీ అయింది చూపిస్తుంది.  క్రెడిట్, డెబిట్‌ కార్డు లేదా స్మార్ట్స్‌ కార్డ్స్‌ ద్వారా రుసుం చెల్లించవచ్చు.  పార్కింగ్‌ స్థలంలో  సీసీ కెమెరా, మ్యాగ్నటెక్‌ ఐ ఆర్‌ సెన్సర్‌ అమరుస్తారు.  వాహనాల పార్కింగ్‌ రోడ్లను మూడు కేటగిరీలుగా ఏర్పాటు చేస్తారు. ఏ ప్రీమియం, బీ వాణిజ్య, సీ సామాన్య అనే విభాగాలుగా విభజిస్తారు. ఏ కేటగిరిలో 14, బీ కేటగిరిలో 46, సీ కేటగిరిలో 25 రోడ్లు ఉంటాయి.

చార్జీలు ఇలా ఉంటాయి
ప్రతిగంటకు ప్రీమియం రోడ్లలో  ద్విచక్రవాహనాలకు గంటకు రూ.15 , నాలుగు చక్రాల వాహనాలకు రూ.30 వసూలు చేస్తారు.వాణిజ్య  రోడ్లలో ద్విచక్రవాహనాలకు  రూ10, నాలుగు చక్రాల వాహనాలకు రూ.20, సామాన్య  రోడ్లలో బైక్‌కు రూ.5, నాలుగు చక్రాల వాహనాలకు రూ.15 చార్జీలు వసూలు చేస్తారు.

మరిన్ని వార్తలు