విమానంలో వివాదం

5 Sep, 2018 09:41 IST|Sakshi

పరస్పర ఫిర్యాదులు

తమిళిసైపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

సోఫియా అరెస్ట్‌.. విడుదల

విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పర ఫిర్యాదులు, కేసులు, అరెస్ట్‌లు, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఇద్దరు సాధారణ ప్రయాణికుల మధ్య వివాదమైతే సులభంగాసమసిపోయేది. అయితే వీరిలో ఒకరు బీజేపీ అగ్రనేత, మరొకరు విప్లవభావాలు కలిగిన విద్యార్థి నేత కావడంతో జాతీయస్థాయి అంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ తమిళనాడుశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ఈనెల 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చెన్నై నుంచి తూత్తుకూడికి విమానంలో బయలుదేరారు. తూత్తుకూడి కందన్‌కాలనీకి చెందిన రిటైర్డు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌స్వామి కుమార్తె లూయీస్‌ సోఫియా (22) సైతం అదే విమానంలో ప్రయాణించారు. కెనడాలో పీహెచ్‌డీ చేస్తున్న సోఫియా ఈనెల 3వ తేదీన చెన్నైకి వచ్చి అదే విమానంలో చెన్నై నుంచి తూత్తుకూడికి బయలుదేరారు. విమానంలో తమిళిసైని చూసి ఆవేశానికి గురైన సోఫియా..‘ఫాసిజ బీజేపీ ప్రభుత్వం నశించాలి’ అంటూ అకస్మాత్తుగా నినాదాలు చేశారు.  విమానం తూత్తుకూడికి చేరగా ప్రయాణికులు తమ లగేజీనీ తీసుకునే ప్రయత్నంలో ఉండగా తూత్తుకూడి విమానాశ్రయంలో దిగిన తరువాత కూడా నినాదాలు కొనసాగించారు.

ఈ సమయంలో తమిళిసై, సోఫియా మధ్య వాదోపవాదాలు సాగాయి. దీంతో విమానాశ్రయ అధికారులకు, ప్రయివేటు విమానయాన సంస్థకు తమిళిసై ఫిర్యాదు చేసి తిరునెల్వేలికి వెళ్లిపోయారు. విమానాశ్రయ అధికారుల ఫిర్యాదు మేరకు పుదుక్కోట్టై మహిళా పోలీసులు వెంటనే విచారణ జరిపి సోఫియాపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 15 రోజుల రిమాండ్‌ చెప్పింది. తరువాత ఆమెను తిరునెల్వేలి మహిళా కారాగారంలో ఉంచారు. ఈ దశలో తనకు అనారోగ్యం ఉందని సోఫియా చెప్పడంతో పోలీసు బందోబస్తు మధ్య తూత్తుకూడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా, సోఫియా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌మంగళవారం విచారణకు వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఎలా నడుచుకోవాలో మీ కుమార్తెకు చెప్పండి అంటూ న్యాయమూర్తి తమిళ్‌సెల్వి కోర్టుకు హాజరైన సోఫియా తండ్రిని ఉద్దేశించి హితవు పలుకుతూ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

తమిళిసైపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
విమానం దిగిన తరువాత తన కుమార్తె నినాదాలు చేసేపుడు మిన్నకుండిన తమిళిసై ఎయిర్‌పోర్టు రిసెప్షన్‌ వద్దకు చేరుకున్న తరువాత పార్టీ కార్యకర్తలతో కలిసి దుర్భాషలాడిందని సోఫియా తండ్రి డాక్టర్‌ స్వామి ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించి తమిళిసై ఇచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకున్నారని, తమ ఫిర్యాదును పక్కనపెట్టేశారని అన్నారు. కనీసం రసీదు కూడా ఇవ్వలేదని చెప్పారు. బెయిల్‌ మంజూరైన అనంతరం సోఫియా తరఫు న్యాయవాది అదిశయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, విమానాశ్రయంలో చోటుచేసుక్ను సంఘటనలపై సోఫియా తండ్రి స్వామి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. స్వామి ఫిర్యాదును నమోదు చేసి చర్యలు చేపట్టేలా ఒత్తిడితెస్తూ జాతీయ, రాష్ట్రీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్‌ వేయనున్నట్లు తెలిపారు.

మంత్రి జయకుమార్‌ సమర్థన
విద్యార్థి సోఫియా చర్యలను సమర్థిస్తే ఏ రాజకీయ పార్టీ నాయకునికి రక్షణ ఉండదని మంత్రి జయకుమార్‌ అన్నారు. వాక్‌స్వాతంత్య్రం అంటే ఎక్కడపడితే అక్కడ విమర్శించడం కాదని, వాటికంటూ ఒక వేదిక ఉంటుందని చెప్పారు.

ప్రతిపక్షాల ఖండనలు
ఇదిలా ఉండగా, విద్యార్థిని సోఫియా అరెస్ట్‌ పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఇది అప్రజాస్వామికమంటూ తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు ఈ చర్య భంగకరమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎన్ని లక్షల మందిని అరెస్ట్‌చేసి జైల్లో పెడతారని అన్నారు. ఇదిగో నేనూ నినదిస్తున్నా ‘ఫాసిజ బీజేపీ ప్రభుత్వం నశించాలి’  అంటూ ట్వీట్‌ చేశారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం అధ్యక్షులు టీటీవీ దినకరన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్‌ తదతరులు కూడా సోఫియా అరెస్ట్‌ను ఖండించారు. సోఫియాకు మద్దతుగా తిరువళ్లూరు జిల్లా తిరుత్తురైపూండి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. జననాయక వాలిబర్‌ సంఘం సభ్యులు తూత్తుకూడి చిదంబరనగర్‌ బస్‌స్టాప్‌ సమీపంలో ఆందోళనకు దిగారు.

పోలీసులకు ఫిర్యాదు చేయలేదు : తమిళిసై
విద్యార్థిని సోఫియాపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తమిళిసై చెప్పారు. మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరునెల్వేలిలో జరుగనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 3వ తేదీన ఇండిగోఎయిర్‌లైన్స్‌ ద్వారా తూత్తుకూడికి విమానంలో బయలుదేరగా 8వ సీటులో ఉన్న సోఫియా అనే యువతి నావైపు చేయి ఎత్తి ఫాసిజ బీజేపీ ప్రభుత్వం నశించాలి అంటూ నినాదం చేసింది. ఏదో చిన్నపిల్ల అని వదిలేశాను. మరలా మరలా నినాదాలు చేసినా నాగరికతను దృష్టిలో పెట్టుకుని మిన్నకున్నాను. రిసెప్షన్‌లోకి వచ్చిన తరువాత .. విమానంలో నినాదాలు చేయడం సబబేనా అని అడిగాను. నాకు మాట్లాడే హక్కుంది.. అలాగే మాట్లాడుతాను అని బదులిచ్చింది. అనాగరికంగా వ్యవహరించింది. ఈ వివాదంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, విమానాశ్రయ అధికారులకు మాత్రమే ఫిర్యాదు చేశాను. అయితే సంఘటనపై వారే విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులే విచారించి తప్పని తేలితే సోఫియాను శిక్షిస్తారు, లేకుంటే వదిలేస్తారు. నేనే ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెనక్కు తీసుకోను’’ అని తమిళిసై స్పష్టంచేశారు.


సోఫియాను కోర్టులో ప్రవేశపెట్టి తీసుకెళుతున్న దృశ్యం

మరిన్ని వార్తలు