సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య

11 May, 2016 08:31 IST|Sakshi

కేకే.నగర్ : పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించాడన్న కోపంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను  హత్య చేసి పరారీలో ఉన్న హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరునెల్వేలి జిల్లా కరివందనల్లూర్ సమీపంలో సెందట్టియార్ సౌత్ వీధికి చెందిన కామాక్షి కుమారుడు ఆనందకుమార్(32) చెన్నైలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రాధిక(28). వీరికి ఆరు నెలల పసిబిడ్డ ఉంది. చెన్నై నుంచి ఆనందకుమార్ భార్య, బిడ్డను చూడడానికి సొంత ఊరుకు వచ్చారు.

మంగళవారం ఉదయం గరిసల కులం సెందట్టియాపురం రోడ్డుపై ఆనందకుమార్ మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న గరివలం వందనల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శంకరన్ కోవిల్ ప్రభుత్వాసుపత్రికి పంపారు. పోలీసుల విచారణలో తగాదాల కారణంగా హత్య జరిగిందని తెలిసింది.

ఆనందకుమార్ తండ్రికి, అతని తమ్ముడు ముత్తువాళి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం ముత్తువాళి కుమారుడు సెల్వరాజ్(33) ఆనంద్‌కుమార్‌పై దాడి చేశాడు. శివగిరి పోలీసులు సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు. అతడు నిబంధన బెయిల్‌పై వెలుపలికి వచ్చాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఆనంద్‌కుమార్‌ను హత్య చేశాడని తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న సెల్వరాజ్ కోసం గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు