నాగార్జున సాగర్‌.. ఒక అరుదైన ముచ్చట​

12 Dec, 2016 14:53 IST|Sakshi
నాగార్జున సాగర్‌.. ఒక అరుదైన ముచ్చట​
నాగార్జున సాగర్‌.. ఇది ఒక ఆధునిక దేవాలయం. దాదాపు పన్నేండేళ్ల శ్రమకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చాలా భాగం హరితవనంగా మారడానికి ఈ ఆనకట్టే కారణం. నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణా నదిపై నాగార్జున సాగర్‌ నిర్మించారు. ఇది దేశంలోనే అతి పెద్ద రాతికట్టడం. 1955-1967కాలంలో దీన్ని నిర్మించారు. దాదాపు 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉన్న ఈ జలాశయం 490 అడుగుల ఎత్తు కలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు ఉంటుంది.

ఇంత పెద్ద రాతి ఆనకట్ట నిర్మాణంలో యంత్రాలకంటే మనుషులే అమితంగా సేవలు అందించారు. పెద్దపెద్ద బండరాళ్లను, ఇనుప సామాన్లను కావిడ్లు వేసుకొని తమ భుజాలపై అంత ఎత్తుకు ఎక్కారు. ఒక చేత్తో కర్ర పొడుచుకుంటూ మరో చేత్తో భుజాలపై త్రాసులాగా తగిలించిన కావిడ్లపై పెద్ద పెద్ద బండరాళ్ల వేసుకొని ఆన కట్ట నిర్మాణానికి అందించారు. పదుల అంతస్తుల్లో నిర్మించిన పరంజీలు ఎక్కి మరీ ఈ సాహసం చేశారు.


మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిన్నచిన్న పిల్లలు కూడా ఈ ఆనకట్ట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తమ నెత్తిన సిమెంటు ఇసుకను, బండరాళ్లను కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా మిక్కిలి సంతోషంతో అందించారు. ఆనాటి పరిస్థితుల ప్రకారం తమ పొట్ట నింపుకునేందుకు అంతపెద్ద కష్టం చేసి ఉంటారేమోకానీ, వాస్తవానికి తాము చేస్తోంది ఒక చరిత్రోపకారం అనే విషయం ఆ అమాయక చిన్నారులకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ వయసులోనే అంతపెద్ద బరువులు మోసిన వారితో పోలిస్తే నేటి చిన్నారుల బలం బలాదురూ అవుతుందేమో..! 
 
మరిన్ని వార్తలు