తండ్రిని హత్య చేసిన కుమారుడి అరెస్టు

1 Oct, 2016 08:58 IST|Sakshi

కేకే.నగర్‌: మద్యం సేవించి వీరంగం సృష్టించిన మాజీ సైనికుడిని అతని కుమారుడు గొంతు నులిమి హత్యచేసిన సంఘటన కన్నమంగళంలో చోటు చేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలో అరుంధతీ పాళయంకు చెందిన సహదేవన్‌(50) మాజీ సైనికోద్యోగి. ప్రస్తుతం ఆటో నడుపుతున్నాడు. ఇతని భార్య సుమతి(40). వీరికి ఇద్దరు కుమార్తెలు, 17 ఏళ్ల కుమారుడు. అతడు అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల్లో ప్లస్‌–2 చదువుతున్నారు.

ఇలా ఉండగా గత 27న సహదేవన్‌ ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించాడు. పోస్టుమార్టం నివేదికలో సహదేవన్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యుల వద్ద పోలీసులు విచారణ జరిపారు. సహదేవన్‌ కుమారుడు హత్య చేసినట్లు తెలిసింది. అతన్ని విచారించగా సహదేవన్‌ రోజూ మద్యం తాగి వచ్చి భార్యా, పిల్లలను ఇష్టం వచ్చినట్లు కొట్టడం, అసభ్యకరంగా తిట్టడం చేసేవాడని తెలిసింది. అదే విధంగా 27న రాత్రి సహదేవన్‌ వీరంగం సృష్టించడంతో ఆగ్రహించిన అతడి కుమారుడు తండ్రిని గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించాడు. అతణ్ని అరెస్టు చేసి కడలూరు జ్యుడిషియల్‌ హోంకు పంపారు.

>
మరిన్ని వార్తలు