నేడు రాష్ట్రానికి సోనియా, మోడీ

16 Apr, 2014 01:08 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: దక్షిణాది ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారించిన జాతీయ పార్టీలు నేతలు తమిళనాడులో ప్రచారానికి సిద్ధమయ్యూరు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ బుధవారం రాష్ట్రంలో ప్రచారానికి రానుండడం సంచలనానికి తెరలేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్న సోనియాగాంధీ బుధవారం ఉదయం 11 గంటలకు కన్యాకుమారిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. ఈ సభా వేదికపైకి మొత్తం 39 మంది అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు. సోనియా రాక సందర్భంగా  కన్యాకుమారి జిల్లాను బందోబస్తు నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోకి ప్రవేశించే అన్ని దారుల్లో ఆరు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. లాడ్జీలన్నీ జల్లెడపట్టేశారు. బాంబ్ స్క్వాడ్, హెలికాప్టర్ తనిఖీలు మంగళవారం పూర్తిచేశారు. 18 ఎకరాల్లో నిర్వహించనున్న ఈ సభను జయప్రదం చేసేందుకు కార్యకర్తలందరూ హాజరుకావాలని ఆదేశించారు.
 
 మోడీ ఆరు ప్రచార సభలు
 బీజేపీ ప్రధాని అభ్యర్ది నరేంద్రమోడీ సైతం బుధ, గురువారాల్లో సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యూరు. బుధవారం మధ్యాహ్నం 3.30గంటలకు కృష్ణగిరి, సాయంత్రం 5.15 గంటలకు సేలం, రాత్రి 7.15గంటలకు కోయంబత్తూరులో ప్రచార వేదికలపై నుంచి ప్రసంగిస్తారు. రాత్రి కోవైలోనే బసచేసి గురువారం నాగర్‌కోవిల్, రామనాథపురం, ఈరోడ్‌లో ప్రచారం చేస్తారు. రజనీ ఇంటికి మోడీ వెళ్లడంపై అలక వహించిన విజయకాంత్‌ను మోడీ సెల్‌ఫోన్ ద్వారా బుజ్జగించారు. దీంతో రామనాధపురం సభలో మోడీతోపాటూ కెప్టెన్ కూడా పాల్గొననున్నారు.
 
 అగ్రనేతల రాక
 ఈనెల 17, 18, 19 తేదీల్లో బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు, 18వ తేదీన మరో అగ్రనేత అద్వానీ ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సైతం వేర్వేరుగా రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. ఈనెల 20 లేదా 21వ తేదీన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించే అవకాశం ఉంది. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్‌కారత్ తిరుపూరు, కోవైలలో మంగళవారం నుంచే ప్రచారం చేస్తున్నారు. అలాగే సీపీఎం అగ్రనేత బృందాకరత్ తిరుచ్చిలో మంగళవారం పర్యటించారు. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న డీఎంకే బహిష్కృతనేత అళగిరి రామనాధపురంలో జరిగే మోడీ సభకు హాజరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  
 

>
మరిన్ని వార్తలు