పెట్రోల్ కావాలంటే పీయూసీ చూపాల్సిందే!

21 Aug, 2014 22:19 IST|Sakshi

 న్యూఢిల్లీ: నగరవాసులు ఇకపై వాహనాలపై తిరిగేటప్పుడు తప్పకుండా పొల్యూషన్ సర్టిఫికెట్‌ను తమతోపాటు ఉంచుకోవాల్సిందే.. వాహనానికి పెట్రోలుగానీ, డీజిల్ గానీ పోయించుకోవాలనుకుంటే వారు ఇకపై పొల్యూషన్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాహనం నుంచి వెలువడుతున్న వాయువులు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్‌ను చూపిస్తేనే ఇంధనం నింపాలని పెట్రోల్, డీజిల్ బంకులకు ప్రభుత్వం ఆదేశించింది.
 
 నగరంలో నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో కొన్ని లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వీటినుంచి వెలువడుతున్న వ్యర్థాలతో నగరంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఇకపై పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కలిగి ఉన్న వాహనాలకే పెట్రోల్, డీజిల్ పోయాలనే నిబంధనను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం అమలులోకి రావడానికి ఇంకా రెండునెలల సమయం పట్టవచ్చు.
 
 అప్పటివరకు ఈ నిబంధనపై నగరంలో విస్తృతంగా ప్రచారంచేసి, వాహనదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. నగరంలో ఉన్న అన్ని పెట్రోల్, డీజిల్ బంక్‌ల వద్ద ప్రచార వాల్‌పోస్టర్లను అంటించనున్నారు. అలాగే ఆయా బంక్‌ల వద్ద కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటివరకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ తీసుకోనివాల్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. నిర్ణయం అమల్లోకి వచ్చాక.. బంకుల్లో పీఎస్ చూపిస్తేనే పెట్రోలుగాని, డీజిల్ గాని పోస్తారు.
 

మరిన్ని వార్తలు