త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

30 Jun, 2014 03:13 IST|Sakshi
  •  ఏఐసీసీ నిర్ణయం ఆధారంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపిక
  •  సంస్థాగత ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపొందించాం
  •  వచ్చే ఏడాది జులైలో కేపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక
  •  సోనియాగాంధీ సూచించేంత వరకూ  ఆ స్థానం నాదే
  •   కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్
  • సాక్షి, బెంగళూరు :  బోర్డులు, కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ఎంపిక త్వరలో ఉంటుందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జీ. పరమేశ్వర్ వెల్లడించారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 110 బోర్డులు, కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. వీటిలో దాదాపు 30 శాతం సంస్థలకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి అధికారులు అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఉండాలన్నారు.

    మిగిలిన 70 శాతం అన్ అఫిషియల్స్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఉండవచ్చున్నారు. ఈ స్థానాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.  పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో రెండు రోజుల పాటు జరిగిన సమీక్ష సమావేశంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారన్నారు.

    దిగ్విజయ్ సింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాల్సిందిగా సూచించారన్నారు. అందువల్ల ఈ విషయంపై ఇక ఆలస్యం చేయకుండా త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అయితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల నియామకానికి సంబంధించి  ఏఐసీసీ అంతిమ నిర్ణయం తీసుకోనుండగా ఈ సంస్థల 1,265 సభ్యులను మాత్రం తామే ఎంపిక చేస్తామన్నారు. అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉండవచ్చునన్నారు.
     
    రోడ్ మ్యాప్ రూపొందించాం

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల కోసం నూతన రోడ్ మ్యాప్ రూపొందించినట్లు పరమేశ్వర్ తెలిపారు. దీని ప్రకారం డిసెంబర్ వరకూ పార్టీ కార్యకర్తల నమోదు ప్రక్రియ (మెంబర్‌షిప్ డ్రైవ్) ఉంటుందన్నారు. తర్వాత బూత్, డీసీసీ అధ్యక్షులు తదితర ఎన్నికలు ఉంటాయన్నారు. చివరిగా వచ్చే ఏడాది జులైలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు.

    తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం హై కమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించేంతవరకూ తాను ఇదే పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే దిశగా అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నామన్నారు.

    అదేవిధంగా దేశంలో మొదటిసారిగా అదే నెలలో ‘రాష్ట్ర స్థాయిలో ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ కన్వెన్షన్’ను కర్ణాటకలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నామన్నారు. ఇందుకు సోనియా, రాహుల్‌గాంధీలను కూడా ఆహ్వానించనున్నామన్నారు. ఇక నవంబర్ 19న రాష్ట్రస్థాయి మహిళా కన్వెన్షన్, అటు తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర విభాగాల కన్వెన్షన్లను బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ తదితర చోట్ల  నిర్వహించనున్నట్లు పరమేశ్వర్ తెలిపారు.
     

మరిన్ని వార్తలు