ప్రధానిని కలిసిన నటి గౌతమి

29 Oct, 2016 14:32 IST|Sakshi
ప్రధానిని కలిసిన నటి గౌతమి
పెరంబూర్‌:  సీనియర్‌ నటి గౌతమి శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. కథానాయకిగా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన గౌతమి ఆ తరువాత కొంత కాలం నటనకు విరామం పలికారు. నటుడు కమలహాసన్‌తో సహజీవనం చేస్తున్న నటి గౌతమి ఇటీవల ఆయనతో కలిసి పాపనాశం చిత్రంలో నటించి సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నమదు అనే త్రిభాషా చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌కు జంటగా నటించిన గౌతమి మంచి పాత్రలు వస్తే నటనను కొనసాగిస్తానని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే గౌతమి కేన్సర్‌ ను జయించిందనే విషయం తెలిసిందే.
 
కాగా శుక్రవారం అనూహ్యంగా ఆమె ప్రధాని నరేంద్రమోదీని కలవడం చర్చనీయాంశంగా మారింది. గౌతమి తను ప్రధానిని కలిసిన విషయాన్ని ఒక ప్రకటనలో పేర్కొంటూ మన దేశ ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని తనను సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారని తెలిపారు. ప్రధాని ఆయన విజన్, రోల్‌ తదితర అంశాల గురించి అరగంట సేపు తనతో పంచుకున్నారని చెప్పారు. తాను కేన్సర్‌ వ్యాధి నుంచి బయట పడిన విషయం తెలిసిందేనని, ఆ వ్యాధిపై అవగాహన కలిగించే విధంగా ఒక స్వచ్ఛంద సంస్థను తాను నిర్వహిస్తున్నానని తెలిపారు. కాగా 2017 యోగా దినోత్సవం నాటికి యోగా, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధాని సూచనల మేరకు తన వంతు కృషి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా పలు అవగాహనా కార్యక్రమాలలో, అభివృద్ధి పరంగానూ దేశం ప్రగతి పథంలో సాగుతోందన్న పలు విషయాలను నటి గౌతమి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అదేవిధంగా డిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో శనివారం ఆమె భేటీ అయ్యారు. ‘లైఫ్ ఎగైన్’  సంస్థ ద్వారా చేస్తున్న పలు కార్యక్రమాలను గౌతమి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. సంస్థ తమ వంతు సాయం చేస్టున్నట్టు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆమె కోరారు.
>
మరిన్ని వార్తలు