జల కళ

3 Aug, 2014 01:02 IST|Sakshi
జల కళ

సాక్షి, చెన్నై : నైరుతీ రుతు పవనాలు కేరళ, కర్ణాటక ప్రజలను కరుణించాయి. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో వర్షాలు కరుస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
 
 డ్యాంలు కళకళ
 గత నెల మొదటి వారంలో పూర్తిగా అడుగంటిన మెట్టూరు డ్యాంను కర్ణాటక వర్షాలు ఆదుకున్నాయి. అక్కడి వర్షాలతో రెండు వారాలకు పైగా కావేరి నది పరవళ్లు తొక్కతూ వచ్చింది. హొగ్నెకల్‌లో కొద్ది రోజులు సందర్శకులకు నిషేధం విధించారంటే కావేరి ఏ మేరకు ఉధృతంగా ప్రవహించిందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం వరద ఉధృతి తగ్గడంతో సందర్శకులకు అనుమతిచ్చారు. ఆహ్లాదకరంగా ఉన్న హొగ్నెకల్‌లో కొత్త అనుభూతిని ఆశ్వాదించే పనిలో సందర్శకులు పడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కర్ణాటకలోని కబిని డ్యాం పూర్తిగా నిండింది.
 
 దీంతో ఉబరి నీటిని పూర్తిగా విడుదల చేస్తూ, గేట్లను ఎత్తి వేశారు. ఇప్పటికే కావేరి నదిలో పదిహేను వేల గణపుటడుగుల నీళ్లు ప్రవహిస్తుండడంతో కబిని డ్యాం ఉబరి నీటితో ఉధృతి మరింత పెరిగింది. సుమారు 30 వేల గణపుటడుగుల మేరకు నీళ్లు విడుదలవుతుండడంతో కావేరి తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. ఈ నీళ్లు మెట్టూరు డ్యాంకు వచ్చి చేరుతుండడంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. సాయంత్రానికి నీటి మట్టం 84 అడుగులు దాటింది. మరి కొద్ది రోజులు నీటి ఉధృతి ఇదే విధంగా కొనసాగిన పక్షంలో మెట్టూరు డ్యాం పూర్తిగా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
 పిల్లూరు ఫుల్
 పశ్చిమ పర్వత శ్రేణుల్లో, కేరళ తీరంలో కురుస్తున్న వర్షాలతో కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలోని పిల్లూరు డ్యాం పూర్తిగా నిండింది. నీటి మట్టం 98 అడుగులకు చేరడంతో ఉబరి నీటిని విడుదలచేసే పనిలో అధికారులు పడ్డారు. ఉదయం ఆ డ్యాం మూడు గేట్లను ఎత్తివేశారు. ఆ డ్యాం నుంచి నీళ్లు పరవళ్లు తొక్కతూ భవానీ నదిలోకి చేరుతున్నాయి. కారమడైలోని శిరువాని డ్యాం సైతం నిండింది. ఆ డ్యాం నుంచి ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రెండు డ్యాంల నీటి విడుదలతో భవానీ నది పరవళ్లు తొక్కతూ, భవానీ సాగర్ డ్యాం వైపుగా ప్రవహిస్తుండడంతో ఆ పరిసర అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక వాతావరణ కేంద్రం శనివారం రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. కోయంబత్తూరులో వరుణుడు కరుణించగా, చెన్నై పరిసరాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పలకరించాయి.
 

మరిన్ని వార్తలు