ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా ఆగని రైతుల ఆత్మహత్యలు

18 Dec, 2014 01:05 IST|Sakshi
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా ఆగని రైతుల ఆత్మహత్యలు

సాక్షి, ముంబై: ప్రభుత్వం కరువుపీడిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 512 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీడ్ జిల్లాలో అత్యధికంగా 141, నాందేడ్ జిల్లాలో 109 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. వరుసగా ఇది మూడో సంవత్సరం కావడంతో అక్కడ వేలాది గ్రామాల రైతుల పరిస్థితి తీవ్రఆందోళనకరంగా మారింది.

అకాల వర్షాల కారణంగా వరి, చెరుకు, పసుపు పంటలతోసహా పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులనుంచి తీసుకున్న అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. ఇంతచేసినా పంటలు చేతికి రాలేదు. ఒకవేళ కొందరికి చేతికొచ్చినప్పటికీ గిట్టుబాటు ధర దక్కలేదు. దీంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. మరోవైపు వడ్డీసహా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ షావుకార్లు, బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో చేసిన అప్పులు చెల్లించే మార్గం లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ ఏడాది బీడ్ జిల్లా పరిధిలో 141, నాందేడ్ జిల్లా పరిధిలో 109, ఔరంగాబాద్ జిల్లా పరిధిలో 46, జాల్నా జిల్లా పరిధిలో 27, పర్భణి జిల్లా పరిధిలో 64, హింగోలి జిల్లా పరిధిలో 30, లాతూర్ జిల్లా పరిధిలో 36, ఉస్మానాబాద్ జిల్లా పరిధిలో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 303 మంది రైతుల కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం త్వరలో అందనుంది. మిగతా కుటుంబాలకు ఆ అర్హత లేదని అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు