400 గ్రామాల దత్తతకు ఎస్వీవీయూ శ్రీకారం

3 Sep, 2016 19:28 IST|Sakshi
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 400 గ్రామాలు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పాలకమండలి నిర్ణయించింది. యూనివర్సిటీ పాలకమండలి సమావేశం శనివారం జరిగింది. ఇన్‌చార్జ్ వీసీ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 30 అంశాలపై చర్చ సాగింది. సమావేశ వివరాలను వీసీ మన్మోహన్ సింగ్ మీడియాకు వివరించారు. 
 
యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించామన్నారు. కర్నూలు జిల్లా బన్వాసిలో వెటర్నరీ పాలటెక్నిక్, గొర్రెల పరిశోధన స్థానం ఏర్పాటుకు పాలకమండలి ఆమోదించిందన్నారు. పాలిటెక్నిక్‌కు రూ.6 కోట్లు మంజూరు చేయాలని తీర్మానించామని చెప్పారు. ఒంగోలు జాతి పశువులపై పరిశోధనకు రూ. 3 కోట్లు, పుంగనూరు జాతి పశువులపై పరిశోధనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా వున్న అధికారుల పోస్టుల భర్తీకి సెలక్షన్ కమిటి ఏర్పాటు చేసేందకు కమిటి ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం జిల్లా సిద్ధరామాపురంలో వెటర్నరి యూనివర్సిటీ పరిధిలోని 525 ఎకరాల్లో గడ్డి క్షేత్రాల అభివృద్ధికి పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి నెల మొదటి శనివారం పశుసంవర్ధక దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 
 
ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..వర్సిటీలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పెట్టాలని భావిస్తున్నామన్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పశు వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఒంగోలు, పుంగునూరు జాతి అభివృద్ధికి పరిశోధనలు వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. 
మరిన్ని వార్తలు